Friday, 23 December 2016

అంగరంగ వైభవంగా సామూహిక గృహ ప్రవేశం

నిరుపేదల స్వప్నం సాకారమైంది. ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరింది. సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో అద్భుతం ఆవిష్కృతమైంది. రెండు గ్రామాల్లోనూ పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగానే ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మొత్తం 580 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. సీఎం కేసీఆర్ ఆద్వర్యంలో ఈ గృహప్రవేశం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ముఖ్యమంత్రి ఇళ్లను ప్రారంభించిన లాంఛనంగా లబ్ధిదారులకు అందజేశారు.   సరిగ్గా ఏడాదిక్రితం అయిత చండీయాగం ప్రారంభించిన రోజే… సామూహిక గృహ ప్రవేశం జరగడం విశేషం.
ముందుగా  నర్సన్నపేట చేరుకున్న సీఎం…  అధ్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 200 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ముఖ్యమంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గృహసముదాయాల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్  పద్మా దేవేందర్  రెడ్డి, మంత్రులు హరీశ్  రావు, ఇంద్రకరణ్  రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.
అనంతరం  ఎర్రవల్లిలోనూ 380 డబుల్ బెడ్రూం ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గృహసముదాయాల ప్రాంగణంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించి.. పూజలు నిర్వహించారు.  గ్రామంలో తిరుగుతూ డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు.
ఎర్రవల్లి, నర్సన్నపేటలో కష్టపడి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించుకున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. అందరం కలిసి మిగిలిన అన్ని పనులను పూర్తి చేసుకుందామన్నారు. లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేటను క్యాష్ లెస్ గ్రామాలుగా ప్రకటించారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేసేలా ఈ గ్రామాలు  ఉండాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.
నూతన గృహ ప్రవేశం చేసిన లబ్దిదారుల కళ్లల్లో ఆనందం తొనికిసలాడింది. సీఎం కేసీఆర్ స్వయానా.. గృహప్రవేశానికి రావడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సొంతింటి కలను నిజం చేసిన ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిదంటూ జనం ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ కు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment