Friday, 30 December 2016

వైకుంఠ ఏకాదశి రోజున తులసి పూజను మరిచిపోకండి..

వైకుంఠ ఏకాదశి రోజున తులసి పూజను మరిచిపోకండని పండితులు సూచిస్తున్నారు. మహావిష్ణువుకు తులసిదళాలు ఎంతో ప్రీతికరమైనవి. వివిధరకాల పూలతో స్వామిని పూజించడం వలన కలిగే ఫలితం, కేవలం తులసిదళాలతో పూజించడం వలన కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ‘ముక్కోటి ఏకాదశి’ రోజున స్వామివారిని అనేక రకాల పూలతో అలంకరించడం, అర్చించడం జరుగుతుంది. ఆ రోజున పూజలోను ‘తులసి’ విశిష్టమైన పాత్రనే పోషిస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం, ఉపవాస జాగరణలనే నియమాలను పాటించడంతో పాటు తులసిదళాలతో పూజించడం శుభప్రద ఫలితాలను ఇస్తుంది.
ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోయినవాళ్లు, వైష్ణవ సంబంధమైన ఆలయాలను దర్శించడం వలన … తులసిదళాలతో స్వామివారిని అర్చించడం వలన కూడా పుణ్యఫలరాశి పెరుగుతుందనీ, మోక్షానికి అవసరమైన అర్హత ప్రసాదించబడుతుందని చెప్పబడుతోంది.
అందువలన వైకుంఠ ఏకాదశిగా పిలవబడుతోన్న ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు జరిపే పూజలో తులసిదళాలు ఉండేలా చూసుకోవడం మరచిపోకూడదని పండితులు అంటున్నారు.

No comments:

Post a Comment