Wednesday, 28 December 2016

సీన్‌ రివర్స్‌ అయింది

ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. మొన్నటిదాకా కొత్త నోట్లను ఎగబడి కొన్న నల్లకుబేరులు ఇప్పుడు పాతనోట్లపై పడ్డారు. పెద్దనోట్ల రద్దు తర్వాత వచ్చిన కొత్త రూ.2000 నోట్లను 15 శాతం దాకా కమిషన్‌ ఇచ్చిన కొన్న నల్లధనవంతులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. కొన్నాళ్ల తర్వాత రెండు వేల నోట్లు రద్దుకానున్నాయని వార్తలు రావడం.. ప్రభుత్వం 50 శాతం పన్నుతో బ్లాక్‌ను వైట్‌ చేసుకోవచ్చని చెప్పడంతో నల్లకుబేరులు ఇప్పుడు 50-50 వైపు మొగ్గు చూపుతున్నారు. తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను తిరిగి ఇచ్చి పాత రూ.500, రూ.1000 నోట్లను కొనుగోలు చేస్తున్నారు. దీనికీ పది శాతం కమీషన్‌ ఇస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటికి 50 శాతం పన్ను కట్టాలని చూస్తున్నారు. మొదట పాత నోట్లను కొత్త నోట్లకు మార్చుకోడానికి 15 శాతం కమీషన్‌ ఇచ్చిన నల్లకుబేరులు పాత నోట్లకు మళ్లీ 10 శాతం కమీషన్‌ ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. ఇలా నోట్ల మార్పిడిలో 25 శాతం 50-50 స్కీం కింద 50 శాతం పన్ను మొత్తం 75 శాతం కోల్పోయినా ఫర్వాలేదు.. కనీసం 25 శాతం డబ్బులైనా వైట్‌ అయితే చాలని అనుకుంటున్నారు. లేకుంటే భవిష్యత్తులో మొత్తం డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. రూ.2వేల నోట్లు భారీగా కనిపిస్తే ఐటీ శాఖ సీజ్‌ చేస్తుండటం.. కొత్త నోట్లను పెద్దఎత్తున బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే అధికారులకు అనుమానం వచ్చే అవకాశం ఉండటం కూడా నల్లకుబేరులు మళ్లీ పాత నోట్లవైపు మొగ్గుచూపేలా చేస్తోంది. భవిష్యత్తులో రూ.2000 నోటు రద్దయితే వాటిని దాచుకున్న నల్లకుబేరులు మొత్తం విలువను కోల్పోయే ప్రమాదం ఉంది. వాటిని మార్చుకోవాలంటే అప్పుడు క్యాష్‌ అందుబాటులో ఉండటం గగనమే. పైగా 2వేల నోటును రద్దు చేయాల్సి వచ్చినపుడు ప్రభుత్వం.. వాటిని అక్రమంగా మార్చుకొనే అవకాశం కూడా లేకుండా ప్రణాళిక రూపొందించే వీలుంది. అందువల్ల వీలైనంత వరకు ఈ నెల 30లోపే పాత నోట్లను కొనుగోలు చేసి వాటిని డిపాజిట్‌ చేయాలని నల్లధనవంతులు చూస్తున్నారు.

చేతిలో నగదు చూపడం కోసం..!

కోల్‌కతా: కోల్‌కతాలోని బుర్రాబజార్‌లో పాత 500, 1000 నోట్లకు రూ.50, రూ.100 ఎదురిచ్చి మరీ తీసుకుంటున్నారు. ఎందుకలా? అని అంటే.. కొన్ని ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం ముగుస్తోంది. దీంతో అన్ని కంపెనీలు తమ వద్ద ఉన్న నగదు నిల్వ, లావాదేవీల లెక్కలు ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ క్రమంలో కొన్ని డబ్బా కంపెనీలు తమ బ్యాలెన్స్‌ షీట్లలో ‘చేతిలో నగదు’ను చూపించేందుకు ఇలా పాత నోట్లను ఎదురు డబ్బు ఇచ్చి కొంటున్నాయి. బుర్రాబజార్‌లోని ఓ దుకాణంలో ఓ వ్యక్తి భారీ మొత్తంలో కొత్త నోట్లను పెట్టుకుని, పాత రూ.500, రూ.1000 నోట్లను కొనుగోలు చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

No comments:

Post a Comment