Wednesday, 28 December 2016

నాకొద్దీ పదవి.. ఐఓఏకు స్పష్టం చేసిన కల్మాడీ ఎదురుదాడికి దిగిన అభయ్‌ సింగ్‌ చౌతాలా సంఘానికి కేంద్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీస్‌ దిల్లీ

నకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) జీవిత కాల గౌరవ అధ్యక్ష పదవి ఇవ్వడంపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో సురేశ్‌ కల్మాడీ వెనక్కి తగ్గాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఈ పదవి చేపట్టలేనంటూ ఐఓఏకు కల్మాడీ లేఖ రాశాడు. ‘‘నన్ను జీవిత కాల అధ్యక్ష పదవితో గౌరవించాలనుకున్నందుకు ఐఓఏకు ధన్యవాదాలు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పదవిని నేను అంగీకరించడం సబబు కాదని భావిస్తున్నా. నా పేరు స్వచ్ఛంగా బయటికి వస్తుందని నమ్మకంతో ఉన్నా. అప్పటి వరకు ఈ గౌరవాన్ని నేను స్వీకరించలేను’’ అని కల్మాడీ ఈ లేఖలో పేర్కొన్నాడు. ఐఓఏ అధ్యక్షుడిగా ఉండగా బయటపడ్డ కామన్వెల్త్‌ కుంభకోణంలో కల్మాడీపై తీవ్ర ఆరోపణలు రావడం, దీనికి సంబంధించిన కేసులో కల్మాడీ పది నెలల జైలు శిక్ష కూడా అనుభవించిన నేపథ్యంలో అతడికి ఐఓఏ పదవి కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కల్మాడీ లాగే ఐఓఏ జీవిత కాల అధ్యక్ష పదవికి నామినేట్‌ అయిన అభయ్‌ సింగ్‌ చౌతాలా మాత్రం తన విషయంలో జరుగుతున్నది అనవసర రాద్దాంతం అన్నాడు. తన గురించి కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డాడు. ‘‘గోయల్‌ స్పందన చూసి నాకు ఆశ్చర్యమేసింది. నా మీద క్రిమినల్‌, అవినీతి కేసులున్నట్లు గోయల్‌ చెప్పాడు. కానీ నాపై క్రిమినల్‌ కేసులేమీ లేవు. ఉన్నదల్లా రాజకీయ కేసు మాత్రమే. క్రీడల మంత్రిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో గోయల్‌ విఫలమయ్యాడు. అతను తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తే ఒలింపిక్స్‌ లాంటి టోర్నీల్లో మన పతకాల సంఖ్య పెరిగేది. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడి వివాదాల్లో చిక్కుకోవడం మాని, గోయల్‌ తన పనిపై దృష్టిసారిస్తే మేలు’’ అని చౌతాలా అన్నాడు. ఐఓఏ జీవిత కాల అధ్యక్ష పదవిని చేపట్టేందుకు తనకు అర్హత ఉందని.. తాను ఒలింపిక్‌ క్రీడల కోసం చాలా చేశానని చౌతాలా పేర్కొన్నాడు.
గుర్తింపు రద్దు చేస్తాం..: మరోవైపు కల్మాడీ, చౌతాలాను జీవిత కాల అధ్యక్షులుగా నామినేట్‌ చేయాలన్న ఐఓఏ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేంద్ర క్రీడల శాఖ.. షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఐఓఏ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. ‘‘ఇది ఐఓఏ రాజ్యాంగానికి విరుద్ధం. మేం దీన్ని అంగీకరించం. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు పదవులివ్వాలన్న నిర్ణయంపై తీవ్రంగా నిరాశ చెందాం. క్రీడల్లో మేం పారదర్శకత కోరుకుంటున్నాం. వీళ్లిద్దరినీ తప్పించడమో.. వాళ్లే రాజీనామా చేయడమో జరిగే దాకా మేం ఐఓఏతో సంబంధాలు సాగించబోం’’ అని క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ స్పష్టం చేశాడు. కల్మాడీ, చౌతాలాను జీవిత కాల అధ్యక్షులుగా నామినేట్‌ చేయాలన్న ఐఓఏ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటన రాగా.. సంఘం అసోసియేట్‌ ఉపాధ్యక్షుడు నరిందర్‌ బత్రా మాత్రం మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం గమనార్హం. వారిపై పడ్డ మచ్చ తొలగిన తర్వాతే ఈ పదవుల్ని స్వీకరించాలని అతను స్పష్టం చేశాడు.

No comments:

Post a Comment