Saturday, 31 December 2016

: యూపీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి.. బాబాయ్‌లతో ముఖ్యమంత్రి అఖిలేష్‌ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అవెంత వరకు వెళ్లాయంటే ముఖ్యమంత్రిగా ఉన్న కొడుకును పార్టీ నుంచి బహిష్కరించేందుకు సైతం ములాయం వెనుకాడలేదు.. గత కొంత కాలంగా తండ్రి.. కొడుకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తయారుచేసిన పోటాపోటీ అభ్యర్థుల జాబితాతో ఈ వ్యవహారం మరింతగా ముదిరిపోయింది. యూపీ అధికారపక్షంలో నెలకొన్న తాజా సంక్షోభం వెనుక అపర్ణా యాదవ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ.. ఈ అపర్ణా యాదవ్‌ ఎవరు? ఆమెకు సమాజ్‌వాదీ సంక్షోభానికి కారణం ఏమిటి? ఆమెకు ఎందుకంత ప్రాధాన్యం అన్న అంశాల్ని చూస్తే..
యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం తండ్రీ కొడుకులు విడివిడిగా పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించడంతో మరోసారి సంక్షోభానికి తెరలేచింది. అయితే అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించిన జాబితాలో లఖ్‌నవూ కంటోన్మెంట్‌ సీటు అభ్యర్థి పేరు లేకపోవటం రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురి చేశాయి. వారు అంతగా ఆశ్చర్యపోవటానికి కారణం లేకపోలేదు. ఆ సీటు అభ్యర్థిగా ఏడాది కిందటే అపర్ణాయాదవ్‌ పేరును ఎస్పీ చీఫ్‌ ములాయం రిజర్వు చేశారు. అలాంటిది అఖిలేశ్‌ మాత్రం తాను సమర్పించిన జాబితాలో అపర్ణ పేరును చేర్చలేదు.
ఆమె ఎవరంటే..?
ఇరవైఆరేళ్ల వయసున్న అపర్ణా యాదవ్‌ ఎవరోకాదు ములాయం సింగ్‌ యాదవ్‌ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ భార్య. ప్రతీక్‌ యాదవ్‌ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ వ్యాపారంలో ఉండటంతో అపర్ణాయాదవ్‌ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఆమెను లఖ్‌నవూ కంటోన్మెంట్‌ సీటుకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ స్థానంలో రీటా బహుగుణా జోషీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. లఖ్‌నవూ ప్రధాన సీటును ఎస్పీ ఇంతవరకు గెలుచుకోలేదు. అందుకే ఆమె రాజకీయ అరంగేట్రం సాఫీగా సాగేందుకు ఈ సీటును కేటాయించారు. ఏడాది నుంచే ఆమె తన ప్రచారాన్ని మొదలు పెట్టారు.
ఆమె వ్యూహం ఏంటీ..?
ఎస్పీలో యువనేతగా ఎదగడమే లక్ష్యంగా అపర్ణ రాజకీయాల్లోకి దిగుతున్నారు. అవసరమైతే అఖిలేష్‌ స్థానాన్ని ఆమె భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. కాలం కలిసి వస్తే.. అఖిలేశ్‌ను తోసిరాజనేందుకు వీలుగా అపర్ణకు అధినేత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెబుతుంటారు. ప్రస్తుతం ఆమె శివ్‌పాల్‌ యాదవ్‌ వర్గంలో ఉన్నారు.
అఖిలేష్‌ను ములాయం కుటుంబ సభ్యులు లక్ష్యంగా చేసుకున్నారంటూ కొన్నాళ్ల కిందట ఎస్పీ నేత ఉదయ్‌వీర్‌ సింగ్‌ ఓ లేఖను విడుదల చేశారు. ఇది పరోక్షంగా అపర్ణా యాదవ్‌ను ఉద్దేశించిందన్న అభిప్రాయం ఉంది. ఈ లేఖపై ములాయం.. సాధనగుప్తాలు అగ్గి మీద గుగ్గిలం కావటం ఒక ఎత్తు అయితే.. అఖిలేష్‌కు ములాయంకు మధ్య విభేదాలను అపర్ణ భర్త ప్రతీక్‌ ఎగదోస్తున్నారని యూపీ సీఎం వర్గం ఆరోపిస్తోంది.

 మోదీ మద్దతుదారు..!
అపర్ణ ప్రధాని నరేంద్రమోదీకి మద్దుతుదారు. ఆమె ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట బహిరంగంగానే చెప్పారు. 2015లో ములాయం మనవడి వివాహానికి మోదీ హాజరైనప్పుడు భర్తతో కలిసి వెళ్లి సెల్ఫీ దిగారు. భాజపా కార్యక్రమాలకు కూడా ఆమె మద్దతు ఇస్తుంటారు.

ఆమెకు పోటీ ఎవరు?
అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ను అపర్ణాయాదవ్‌కు ప్రత్యర్థిగా పలువురు అభివర్ణిస్తుంటారు. పార్టీ కార్యక్రమాల్లో బాగా కష్టపడతారన్న పేరు డింపుల్‌కు ఉంది. కుటుంబంలో చోటు చేసుకున్న లుకలుకలు ఇప్పుడు పార్టీని సంక్షోభం దిశగా నడిపించటమే కాదు.. ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు విజయం మీద ప్రభావితం చూపించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చి..
యూపీ రాజకీయ సంచలనమైన అపర్ణా యాదవ్‌ బిష్త్‌ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి అరవింద్‌ సింగ్‌ బిష్త్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా లఖ్‌నవూ బ్యూరో చీఫ్‌. అపర్ణ లఖ్‌నవూలోని ఓ ప్రఖ్యాత పాఠశాలలో చదువుకున్నారు. అక్కడే ప్రతీక్‌ యాదవ్‌ కూడా చదువుకున్నారు. కానీ అప్పట్లో ప్రతీక్‌ యాదవ్‌కు ములాయంకు మధ్య సంబంధం లోకానికి తెలియదు. వీరి బంధాన్ని 2007లో ములాయం బయటపెట్టారు. అపర్ణ, ప్రతీక్‌లు తొలుత సన్నిహిత మిత్రులు. తర్వాత వీరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రతీక్‌ నేపథ్యం తెలియకుండానే దగ్గరయ్యారు. ఆమె తొలిసారి ప్రతీక్‌ తల్లివద్దకు వెళ్లినప్పుడే ములాయం కుమారుడన్న విషయం తెలిసింది. అప్పట్లో వీరి ప్రేమను అపర్ణ తండ్రి అరవింద్‌ అంగీకరించలేదు. వీరిద్దరు ఇంగ్లాండ్‌లో ఉన్నత చదువులు అభ్యసించారు. అపర్ణ అంతర్జాతీయ సంబంధాల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయగా ప్రతీక్‌ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్సీ చేశారు. అపర్ణ, ప్రతీక్‌ల పెళ్లికి ములాయం అంగీకరించకపోవడంతో.. సాధన గుప్తా భర్తను ఒప్పించాల్సి వచ్చింది. అనంతరం వీరి పెళ్లిని ములాయం ధూంధాంగా నిర్వహించారు. ఇది ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే అత్యంత వైభవంగా జరిగిన పెళ్లిగా చెప్పుకొంటారు.

 

No comments:

Post a Comment