మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణపరమాత్మ ‘భగవద్గీత’
విభూతియోగంలో చెప్పాడు. అంటే, ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం.
ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈమాసం, ప్రకృతిని అంటా సౌందర్యమాయం చేస్తుంది. ఈ
మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సారమానాన్ని అనుసరించి
ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా
చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని
రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ,
ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే
ఉత్తరాయణం దేవతలకు పగటికాలమైతే, దక్షిణాయణం రాత్రికాలమని చెప్పబడుతోంది.
విష్ణుమూర్తి రాత్రికాలమైన దక్షిణాయనంలో ఆషాడ శుద్ధ ఏకాదశినుండి
నాలుగునెలలపాటు యోగ నిద్రలో గడుపుతూ లోకం తీరుతెన్నులను గమనిస్తుంటాడు.
అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘శయన ఏకాదశి’ (తొలిఏకాదశి) అని అన్నారు. తొలి
ఏకాదశికి యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తీక శుద్ద ఏకాదశి రోజున
మేల్కొంటాడు. అందుకే దీనినిన్ ‘ఉత్థాన ఏకాదశి’ అని అన్నారు.
తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ‘ఏకాదశి’. ఏకాదశి
అంటే తిథులలో పదకొండవది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ‘ఒకటి, కృష్ణపక్షంలో
ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఆవిధంగా సంవత్సరంలో ఇరవైనాలుగు
ఏకాదశులు.’ చాంద్రమానం ప్రకారం, మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం
వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులోస్తాయి. ప్రతిఏకాదశి ఓపర్వదినమనే
చెప్పొచ్చు. అసలు ఏకాదశి ఆవిర్భావం కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య
ఏర్పడింది. పూర్వం మృదుమన్యుడు అనే రాక్షసుడు, శివుని గురించి తీవ్రమైన
తపస్సు చేసి, ఆ స్వామిని మెప్పించి స్త్రీ పురుషుల నుండి తనకు మరణం లేకుండా
ఉండేట్లుగా వరాన్ని పొందాడు. వరాన్ని అనుగ్రహించిన శివుడు అయోనిజ అయిన
స్త్రీ చేతిలో మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని
గ్రహించిన మృదుమన్యుడు, వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి
దేవతలంతా పారిపోగా, వారి దేవేరులంతా ఒక ఉసిరిచెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ
తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య
ఉదయించింది. ఇంతలో దేవతలను వెదుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను
సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెదకడానికి ప్రయత్నిస్తుండగా, దేవేరుల
ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయిన కన్య చెట్టుతొర్ర నుంచి బయటకు వచ్చి
మృదుమన్యుడిని సంహారించింది. ఆ కన్యక పేరే ‘ఏకాదశి’, అప్పట్నుంచి ప్రతి
పక్షంలో పదకొండవ రోజున ఆమెను పూజించడం ఆచారమైంది.
ఏకాదశి మహాత్యాన్ని తెలిపే అనేక కథలు మన పురాణాలలో
ఉన్నాయి. ఆ కథలలో రుక్మాంగదుని కథ ఒకటి. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు
చక్కగా పరిపాలన చేస్తూ, ప్రజలను కంటి పాపలవలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడ
ధర్మవర్తనులై జీవిస్తుండే వారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి
పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలసి ఓ పన్నాగం
పన్నాడు. ఆ పథకం ప్రకారం, రంభ మోహినీ వేషధారిణియై, రుక్మాంగదుని
వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా, మార్గమధ్యంలో
తారసపడిన మోహినీ రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మొహావేశపరవశుడై
తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తియై ఉంటేనే
పెండ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను
వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతబ్రష్టున్ని చేయడమే ఆమె లక్ష్యం
కనుక ఓ ఏకాదశినాడు తనతో దాంపత్యసుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు
రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని
సంహరించమని ఆమె కోరింది. ఏకాదశివ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు
కన్నకొడుకును చంపడానికి నిర్ణయించుకోగా, అతని భక్తికి మెచ్చిన విష్ణువు
ప్రత్యక్షమై, జరిగిన మోసాన్ని అతనికి వివరించి, రుక్మాంగదునికి మోక్షాన్ని
ప్రసాదించాడు.
ఇక ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖసంతోషాలను అందించే
పర్వంగా భక్తజనులచే ఎంతో గొప్పగా జరుపబడుతుంటుంది. మన తెలుగువాళ్ళు ఈ
పండుగను ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలుచుకుంటూఉంటారు. ఈ రోజున విష్ణువు మూడు
కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడనీ, అందుకే ఈ పండుగ ‘ముక్కోటి ఏకాదశి’
అని పిలువబడుతోంది అంటారు. స్వామి భూలోకానికి దిగి రావడం వెనుక ఓ ఉదంతం
ఉంది. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా మురాసురుడు అనే రాక్షసుడు
రాజ్యపాలన చేస్తూ, దేవతలను విపరీతంగా పీడిస్తుండేవాడు. అతని హింసను
తట్టుకోలేక పోయిన దేవతలు, వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో
మొరపెట్టుకున్నారు. దేవతల అభ్యర్థనలను ఆలకించిన విష్ణువు వైకుంఠాన్నుంచి
దిగి వచ్చి మురాసురుని సంహరించాడు. ఆ సంహారం ఏకాదశినాడు జరిగినందువల్ల, ఈ
రోజుకి ‘వైకుంఠ ఏకాదశి’ అని పేరు వచ్చింది
No comments:
Post a Comment