Wednesday, 28 December 2016

స్మార్ట్‌.. ఒక వ్యసనం నిద్ర లేచింది మొదలు దానితోనే 53 శాతం కొనుగోళ్లు ఆన్‌లైన్‌లో డేటా కోసం వైఫై పైనే ఆధారపడటం లేదు 4జీ యే కీలకంగా మారుతోంది ఆర్థిక లావాదేవీలకూ ఇవే కీలకం డెలాయిట్‌ గ్లోబల్‌ మొబైల్‌ కన్జూమర్‌ సర్వే

రోజును మొదలు పెట్టేది స్మార్ట్‌ఫోన్‌తో.. ముగించేదీ దాని పరిశీలనతోనే.. అంతేనా రోజంతా కూడా వేర్వేరు కార్యకలాపాల కోసం, తాజా సమాచారం సేకరించేందుకు వాటిపైనే ఆధారపడుతున్నారు.. ఒకరకంగా స్మార్ట్‌ఫోన్‌ భారతీయుల్లో అత్యధికులకు ‘వ్యసనం’గా మారింది. మొబైల్‌ వినియోగ అలవాట్లపై ప్రపంచవ్యాప్తంగా సర్వే నిర్వహించిన డెలాయిట్‌ గ్లోబల్‌ మొబైల్‌ కన్జూమర్‌ తన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్లను ఇ కామర్స్‌ పోర్టళ్లలో 53 శాతం మంది కొనుగోలు చేస్తున్నారని, వీటి కోసం సంప్రదాయ దుకాణాలకు వెళ్తున్న వారు 39 శాతం మందే అని సర్వే వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లు డేటా కోసం గతంలో వైఫై పై అధికంగా ఆధారపడే వారని, 4జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చాక, మొబైల్‌ డేటానే ఎక్కువగా వినియోగిస్తున్నామని 59 శాతం మంది తెలిపారు. 4జీ డేటా వినియోగం వచ్చే ఏడాదిలో మరింతగా పెరిగి, దేశీయంగా ఇదే కీలకంగా మారనుందని వివరించింది. రాబోయే 12 నెలల్లో 4జీ డేటా కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటామని 45 శాతం మంది తెలిపారని సర్వే పేర్కొంది. రాబోయే 12 నెలల్లో కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసుకుంటామని 63 శాతం మంది తెలిపారు.
దినచర్య ప్రారంభం, ముగింపు ఫోన్‌తోనే
స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లలో అత్యధికులు రోజూ నిద్ర లేవగానే ఫోన్‌ను పరిశీలించుకోవడంతోనే దినచర్య ఆరంభిస్తారని, నిద్రకు ఉపక్రమించేముందు కూడా ఫోన్‌ పరిశీలనే చేస్తారని తేలింది.
* నిద్ర లేవగానే ఫోన్‌ను 5 నిమిషాల్లోపే పరిశీలించేవారు 61% మంది అయితే, 30 నిమిషాల్లోపు చూసుకునేవారు 88% మంది. గంటలోగా పరిశీలించుకునే వారు 96% మంది కావడం గమనార్హం. నిద్రకు ఉపక్రమించే ముందు 15 నిమిషాల పాటు ఫోన్‌ చూసుకుంటామని 74 శాతం మంది తెలిపారు.
పనులకూ అంతరాయం
స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఎంతలా పెరిగిందంటే, రోజువారీ పనులకు ఆటంకం కలిగించే స్థాయికి చేరింది. తరచు తనిఖీ చేసుకునేలా, వ్యక్తిగత సమయాన్ని హరించే స్థాయికి స్మార్ట్‌ఫోన్‌ చేరిందని డెలాయిట్‌ టచ్‌ తోమత్సు ఇండియా భాగస్వామి నీరజ్‌ జైన్‌ పేర్కొన్నారు.
ఆర్థిక లావాదేవీలకు వినియోగం
పెద్దనోట్ల రద్దు అనంతరం ఆర్థిక కార్యకలాపాలకు డిజిటల్‌ సంస్థలు కీలకమయ్యాయి. కొనుగోళ్లు, చెల్లింపులకు ఆన్‌లైన్‌, మొబైల్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకోసం ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మారుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. డేటా చౌకగా లభించడం కూడా ఇందుకు ఉపకరిస్తోంది. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగం మరింత పెరగనుంది. బ్యాంక్‌ ఖాతాలో నగదు నిల్వ పరిశీలన-బిల్లుల చెల్లింపునకు 54 శాతం మంది, నగదు బదిలీకి 38 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు.
* దుకాణాల్లో చెల్లింపునకు మొబైల్‌ వాడేందుకు 29 శాతం మంది వెనుకాడుతున్నారు. అదనపు ప్రయోజనం లేనందున వాడటం లేదని 19 శాతం మంది చెబితే, క్రెడిట్‌కార్డులు వాడితే రివార్డు పాయింట్లు వస్తాయని 15 శాతం మంది తెలిపారు.
ఉదయాన్నే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌
అత్యధికులు ఉదయాన లేవగానే సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వంటివే చూసుకుంటారు. అనంతరం వ్యక్తిగత ఇ మెయిళ్లు, సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎంఎస్‌) పరిశీలిస్తున్నారు. ఎక్కువసార్లు ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ చూసుకునేవారు 74 శాతం మంది అయితే, సామాజిక మాధ్యమాలు తనిఖీ చేసుకునేవారు 64 శాతం, మెయిల్‌ పరిశీలించుకునేవారు 63 శాతంగా ఉన్నారు. కనీసం వారానికి ఒకసారైనా మెసేజింగ్‌ యాప్‌లు వినియోగించేవారు 80 శాతం మంది ఉన్నారు.
ల్యాప్‌టాప్‌ల కంటే ఇవే ఎక్కువ
ల్యాప్‌టాప్‌ల కంటే స్మార్ట్‌ఫోన్లే అత్యధికులకు చేరువయ్యాయని నివేదిక పేర్కొంది. 71 శాతం మంది దగ్గర ల్యాప్‌టాప్‌లుంటే, 86 శాతం మంది దగ్గర స్మార్ట్‌ఫోన్లున్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే, టాబ్లెట్‌ల కొనుగోలుపై ప్రజలకు ఆసక్తి తగ్గింది. రోజువారీ కార్యకలాపాలకు, సన్నిహితులతో అనుసంధానమై ఉండేందుకు, తాజా సమాచారం కోసం తరచు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్న/తనిఖీ చేసుకునే ధోరణి ఎక్కువమందికి ఒక వ్యసనంలా మారింది.
31 దేశాల్లో అభిప్రాయ సేకరణ
మొబైల్‌ వినియోగ అలవాట్లపై ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాల్లోని 31 దేశాలకు చెందిన 53,000 మంది, దేశీయంగా 2,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి, విశ్లేషణ చేసినట్లు సంస్థ తెలిపింది. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న దేశంలోని 8 నగరాలలో 18-54 ఏళ్ల వారి నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు వెల్లడించింది.

No comments:

Post a Comment