Saturday, 24 December 2016

దేశ ప్రజలకు శుభవార్త


: దేశ ప్రజలకు నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్‌ శుభవార్తనందించింది. నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీ కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి ఊరట కలగనుంది. కొత్త 500 రూపాయల నోట్లు భారీగా అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు కరెన్సీ నోట్ ప్రెస్ ప్రకటించింది. నోట్లను ముద్రించే నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్‌ కొత్త రూ. 500 కరెన్సీని భారీగా ముద్రిస్తోంది. రోజుకు కోటి నోట్లను ముద్రిస్తున్నట్లు ప్రెస్ వర్గాలు తెలిపాయి. రోజుకు 500 కోట్ల రూపాయల కరెన్సీ 500 నోట్లను ముద్రిస్తున్నామని, వాటితో పాటు మరో 90 లక్షల వేర్వేరు నోట్లు కూడా ముద్రిస్తున్నామని, రోజుకు మొత్తం 1.90 కోట్ల నోట్లు నాసిక్ ప్రెస్‌ నుంచి వస్తున్నాయని వారు పేర్కొన్నారు. వాటిలో 100, 50, 20 రూపాయల నోట్లు కూడా ఉన్నాయని, కొత్త 2వేల రూపాయల నోట్లను మాత్రం ముద్రించడం లేదని కూడా వారు వివరించారు.
 
గతంలో రోజుకు 35 లక్షల నోట్లను మాత్రమే ముద్రించేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య మూడు రెట్లకు పెరిగిందని తెలిపారు. శుక్రవారం రోజున నాసిక్‌ ప్రెస్ నుంచి మొత్తం 4.30 కోట్ల నోట్లను రిజర్వు బ్యాంకుకు పంపారు. వాటిలో 1.1 కోట్ల 500 రూపాయల నోట్లు, 1.2 కోట్ల 100 రూపాయల నోట్లు, కోటి చొప్పున 50, 20 రూపాయల నోట్లు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రిజర్వు బ్యాంకుకు కొత్త నోట్లు అందడం ఇదే మొదటిసారి.
 
గత 43 రోజుల్లో నాసిక్ ప్రెస్ నుంచి మొత్తం 82.8 కోట్ల నోట్లు రిజర్వు బ్యాంకుకు చెందిన వివిధ కార్యాలయాలకు చేరాయి. వీటిలో 25 కోట్ల నోట్లు 500 రూపాయలవి. గత మూడు రోజుల్లో 8.3 కోట్ల నోట్లు పంపిణీ చేయగా, వాటిలో 3.75 కోట్ల నోట్లు 500 రూపాయలవి. జనవరి 31 నాటికి మరో 80 కోట్ల కరెన్సీ నోట్లు ముద్రించి పంపగలమని నాసిక్ ప్రెస్ వర్గాలు తెలిపాయి. దేశంలో మొత్తం నాలుగు మాత్రమే కరెన్సీ నోట్ ముద్రణ ప్రెస్‌లు ఉన్నాయి. వాటిలో రెండు మైసూరులో ఉండగా, మరొకటి బెంగాల్‌లోని సల్బోనిలో, ఇంకొకటి నాసిక్‌లో ఉంది. ప్రస్తుతం ఈ నాసిక్ ప్రెస్‌లో వారంతపు సెలవులు ఇవ్వడంలేదు. లంచ్, డిన్నర్ బ్రేక్‌లు తీసుకోకుండా రోజుకు 11 గంటలపాటు సిబ్బంది పని చేస్తున్నారు

No comments:

Post a Comment