Friday, 30 December 2016

శబాష్ శ్రీలక్ష్మి....వాట్సప్‌ వేధింపులపై పవర్‌పంచ్!

‘నన్ను ఎప్పుడు రమ్మంటావు? నీ ‘‘రేటు’’ ఎంత’’?.... ‘‘రూ.3000 సరిపోతుందా? ఏదైనా హోటల్ రూమ్ బుక్ చేయమంటావా?’’... కేరళలలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సీఈవో, మోటివేషనల్ స్పీకర్ శ్రీలక్ష్మి సతీష్‌కు గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి తరచూ వస్తున్న కాల్స్ ఇవి... అది మొదలు అనేక మంది మానవ మృగాల నుంచి ‘‘రేటు’’ అడుగుతూ వరుసగా కాల్స్, మెసేజ్‌లు రావడం మొదలైంది. మరొకడు రూ.25వేలు ఇస్తాను రమ్మంటూ వేధించాడు. దీంతో శ్రీలక్షి తన ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. అయితే మరో గంటలోనే షాక్ నుంచి తేరుకుని ఎవరైతే ఫోన్లు చేశారో వారిలో ఒకరి నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆమె తన హోదా గురించి చెప్పే సరికి అతగాడు గజగజ వణికిపోయాడు. క్షమించమంటూ వేడుకున్నాడు. ఇతనొక్కడికే కాదు... సదరు వాట్సాప్ గ్రూప్‌లోని సంభాషణల ద్వారా ఈ మొత్తానికి కారణమైన మృగాడి ఫోన్ నంబర్ కూడా కనిపెట్టారామె. ఆయా సంభాషణలను స్క్రీన్‌షాట్ తీసి ఫొటోలు సంపాదించారు. ఈ గ్రూప్‌లో తన ఫోన్ నంబర్ పోస్టు చేసిన వ్యక్తి... ఓ జాతీయ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడని గుర్తించారు. బయటికి మంచి వ్యక్తిలా నటిస్తూ... నీచంగా ప్రవర్తిస్తున్న అతడిపై ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం పసిగట్టిన సదరు పార్టీ కార్యకర్తలు ఆమెకు ఫోన్ చేసి కాళ్లబేరానికి వచ్చారు. క్షమాపణ చెబుతూ.. కోర్టుబయటే రాజీ కుదుర్చుకుందామని బతిమాలారు. అయితే అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని, బహిష్కరించినదానికి రుజువుగా పార్టీ సమావేశం మినిట్స్‌ను తనకు అప్పగించాలని శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. దీంతో ఆ యువనేత తండ్రి శ్రీలక్ష్మిని కలుసుకుని పోలీసుకు ఫిర్యాదు చేయవద్దంటూ వేడుకున్నారు. దీంతో ఏదయినా స్వచ్ఛంద సేవా సంస్థకు రూ.25 వేల విరాళం ఇచ్చి... రసీదు తనకు అప్పగించాలని శ్రీలక్ష్మి వారికి సూచించారు. అలా చేసినప్పటికీ శ్రీలక్ష్మి తన కోపం చల్లారక ఈ వృత్తాంతం మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో... నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే 1300 మందికి పైగా షేర్ చేసుకోగా 1200 మంది ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. 4500 మంది లైక్ చేశారు.

No comments:

Post a Comment