వివాదాస్పద
ఇళ్ల నుంచీ ఆస్తి పన్ను
జీహెచ్‌ఎంసీ
కీలక నిర్ణయం
ఇలాంటివి మహా
నగరంలో లక్షకు పైగా ఇళ్లు
దీనివల్ల యాజమాన్యపు
హక్కు ఇచ్చినట్లు కాదు
ఈనాడు-సిటీ
బ్యూరో ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్
మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వివాదంలో ఉన్న లక్షకుపైగా
ఇళ్లకు ఆస్తి పన్ను వేసి వసూలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల బల్దియాకు
ఏటా రూ.40 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్దాలుగా వివాదాల
మధ్య నలుగుతున్న ఇళ్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. మియాపూర్‌లోని గోకుల్
ట్రస్టు పరిధిలో దాదాపు రెండువేల ఇళ్ల వరకు ఉన్నాయి. ఈ స్థల వివాదం కొన్నేళ్లుగా
కొనసాగుతూనే ఉంది. ఇంతలో కొంత భూమి తమదని ప్రభుత్వం వాదిస్తోంది.
ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల మధ్య కూడా వివాదం ఉంది. దీంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి
బల్దియా అధికారులు అధికారికంగా అనుమతి ఇవ్వడం లేదు. అయినప్పటికి
అక్కడ వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగిపోతూనే ఉంది. హైటెక్ సిటీకి దగ్గరలోని
గురుకుల్ ట్రస్టు పరిధిలో, హఫీజ్‌పేటలో కూడా ఇలానే. ఇలాంటివి నగరంలో
1,21,640 ఇళ్లు ఉన్నట్టు లేక్క తేల్చారు. 49,240 ఇళ్లు ప్రభుత్వ భూమిలోనూ,
52,934 ఇళ్లు నోటరీ భూముల్లో, 8,111 ఇళ్లు వక్ఫ్ భూముల్లో, 3,036 ఇళ్లు చెరువు
ఎఫ్‌టీఎల్ పరిధిలో, 1480 ఇళ్లు నాలాల పరిధిలో, 1338 ఇళ్లు దేవాదాయ
భూముల్లో మిగిలినవి ఇతర వాటిల్లో ఉన్నట్టు తేల్చారు. ఇలాంటి వివాదాస్పద
భూముల్లో ఇళ్లను నిర్మించుకున్న యజమానుల నుంచి ఎటువంటి ఆస్తి పన్నును
వసూలు చేయడం లేదు. ఆస్తి పన్ను వేస్తే వారు కోర్టుకు వెళ్లే అవకాశం
ఉందన్న ఉద్దేశంతో అధికారులు వాటి జోలికి వెళ్లలేదు. ఇందులో చాలా ఇళ్లు
కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బల్దియా కమిషనర్ బి.జనార్దనరెడ్డి
దీనిపై అధికారులతో చర్చించారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారం ఆస్తి పన్ను
విధించినంత మాత్రాన సంబంధిత వివాదాస్పద ఇంటిపై యాజమాన్యపు హక్కు
దక్కదని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ విషయం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
దృష్టికి తెచ్చారు. వీరి నుంచి ఇంటి పన్ను వసూలు చేయడానికి మంత్రి కూడా
ఆమోదం తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం నుంచి వర్తించేలా ఇంటి పన్నును
వసూలు చేస్తారు. అనుమతి ఇచ్చిన ఇళ్లకు వసూలు చేస్తున్న మొత్తం కంటే రెండు
రెట్లు అధికంగా వీరి నుంచి ఆస్తి పన్నును వసూలు చేస్తారు. రెండింతల పన్ను
వసూలు చేయడం వల్ల ఏటా రూ.40 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా.
No comments:
Post a Comment