Friday, 30 December 2016

తండ్రీకొడుకుల సవాల్ : పార్టీ నుంచి సీఎం అఖిలేష్ బహిష్కరణ

స‌మాజ్‌వాదీ పార్టీలో ముస‌లం ముదిరింది. క‌న్న కొడుకునే పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు పార్టీ అధినేత ములాయం సింగ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు బాబాయ్ అబ్బాయ్ మ‌ధ్యే న‌డిచిన వార్ ఇక తండ్రీ కొడుకుల కొట్లాట‌గా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాది అభ్య‌ర్థులు జాబితాతో విబేధించిన సీఎం అఖిలేష్ యాద‌వ్, త‌న సొంత అభ్య‌ర్థుల‌తో మ‌రో జాబితాను విడుద‌ల చేశారు. దీంతో అగ్గిరాజేసుకుంది.
పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందున అఖిలేష్‌, రాంపాల్ యాద‌వ్‌ల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ములాయం. నోటీసులు జారీ చేసిన కాసేప‌టికే ప్రెస్‌మీట్ పెట్టి స‌మాజ్‌వాదీ పార్టీ  పెద్దాయన సీఎం అఖిలేష్‌ను, రాంగోపాల్‌ను పార్టీ నుంచి 6ఏళ్లు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
రాంగోపాల్ మొద‌టి నుంచి పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, అఖిలేష్‌ను సైతం త‌ప్పుదోవ ప‌ట్టించాడ‌ని ములాయం చెప్పారు. అఖిలేష్‌ను స‌స్పెండ్ చేయ‌డం బాధించింద‌ని అయితే పార్టీ మేలు కోరి ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ములాయం అన్నారు. దీంతో అఖిలేష్ సీఎం ప‌ద‌వి ప్ర‌శ్నార్థ‌క‌మైంది. దీంతో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు వేడెక్కాయి. అఖిలేష్ మ‌రో పార్టీ పెడ‌తార‌న్న వార్త‌లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి.
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం పెమా ఖండూను ఆ పార్టీ ఎమ్మెల్యేలే స‌స్పెండ్ చేసిన కొన్ని గంట‌ల‌కే… స‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన సీఎం అఖిలేష్‌ను పార్టీ చీఫ్ తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

No comments:

Post a Comment