Friday 30 December 2016

పెద్ద నోట్ల రద్దు తర్వాత.. బాబాకు భారీగా విరాళాలు

పెద్ద నోట్ల రద్దు తర్వాత మహారాష్ట్రలోని ప్రముఖ షిరిడీ సాయి బాబా ఆలయానికి కోట్లలో విరాళాలు అందాయి. ఈ 50 రోజుల్లో సుమారు రూ.31.73 కోట్లు వచ్చినట్లు సాయి సంస్థాన్ శుక్రవారం ప్రకటించింది. హుండీల ద్వారా రూ.18.96 కోట్ల విరాళాలను భక్తులు సమర్పించారు. ఇందులో రూ.4.53 కోట్లు రద్దైన రూ.500, రూ.1000 నోట్లు కాగా రూ.3.8 కోట్లు కొత్త రూ.2000, రూ.500 నోట్లు.
 
షిరిడీ సాయికి మరో రూ.4.25 కోట్లు ఆన్‌లైన్ ద్వారా అందాయి. వీటిలో రూ.2.62 కోట్లు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రాగా, రూ.3.96 కోట్లు డీడీలు, మరో రూ.1.45 కోట్లు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా, రూ.35 లక్షలు మనీ ఆర్డర్ల ద్వారా వచ్చాయి. వీఐపీ దర్శనాలు, హారతి పాసుల ద్వారా మరో రూ.3.18 కోట్లు అందాయి. అంతేగాక రూ.73 లక్షల విలువైన 2.9 కిలోల బంగారు ఆభరణాలు, రూ.18 లక్షల విలువైన 56 కేజీల వెండి వస్తువులను భక్తులు సమర్పించారు.
 
షిరిడీ సాయి బాబా ఆలయానికి గత ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా రోజుకు సగటున రూ.44.38 లక్షల చొప్పున ఏడాదిలో రూ.162 కోట్లు విరాళాలుగా వచ్చాయి. అయితే పెద్ద నోట్లు రద్దు తర్వాత రోజుకు సగటున రూ.37.92 లక్షల చొప్పున విరాళాలను భక్తులు సమర్పించినట్లు సాయి సంస్థాన్ ట్రస్ట్ ప్రతినిధి సచిన్ తాంబి వివరించారు.

No comments:

Post a Comment