Saturday 31 December 2016

జయ ఆశయాల కోసం పనిచేస్తా: శశికళ

అమ్మే మన ధైర్యం, శక్తి అని అన్నాడీఎంకే నూతన జనరల్‌ సెక్రటరీ శశికళ అన్నారు. అమ్మ ఆశయాల సాధనకు పనిచేస్తానని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. జయలలిత ఎప్పటికీ పార్టీ కార్యకర్తల్లో సజీవంగా ఉంటారని అన్నారు. ఆమె స్థానం మరో వెయ్యేళ్లైనా ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ఆమె మరణాన్ని వూహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. కోలుకుంటున్న సమయంలో గుండెపోటు వచ్చిందని వివరించారు.
జయలలితతో తనకు 33ఏళ్ల అనుబంధం ఉందని, ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి తాము సన్నిహితంగా ఉన్నామని శశికళ తెలిపారు. ప్రజల కోసమే అన్నాడీఎంకే ఉందన్నారు. జయలలిత మరణానంతరం శశికళ తొలిసారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జయలలిత కార్యకర్తలను కలుసుకునేందుకు ఉపయోగించే బాల్కనీలోకి వచ్చి మాట్లాడారు. పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే ఆరో జనరల్‌ సెక్రెటరీగా ఎన్నికైన శశికళ ఆ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ. ఆమె వయసు 62 సంవత్సరాలు.
ఎంజీఆర్‌ పేరున ప్రత్యేక స్టాంపు, నాణెం విడుదల చేయాల్సిందిగా పార్టీ తరఫున కేంద్రాన్ని కోరుతామని శశికళ ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే సంవత్సరం ఎంజీఆర్‌ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 33 ఏళ్లపాటు జయలలిత వెంట వుంటూ ఎన్నో సమావేశాల్లో పాల్గొన్న తాను ఇలా ఒంటరిగా ఈ సమావేశంలో పాల్గొనాల్సివస్తుందని వూహించలేదంటూ కంటతడి పెట్టారు.

No comments:

Post a Comment