Thursday 29 December 2016

మోదీ ప్రకటనకు 3గంటల ముందే..

నవంబర్‌ 8న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన దేశంలో పెను సంచలనం సృష్టించింది. దేశంలో నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం నిర్మూలనే ధ్యేయంగా పెద్ద నోట్లను రద్దుచేసినట్లు చేసిన మోదీ ప్రకటనకు కేవలం మూడు గంటల ముందే ఆర్బీఐ ఆమోదం తెలిపిందట. ఈ విషయాన్ని ఆర్బీఐ స్వయంగా వెల్లడించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంతమంది స్వాగతించారు, ఎందరు వ్యతిరేకించారు అనే అంశం తాము రికార్డు చేయలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ సంస్థ సమాచార హక్కుచట్టం కింద అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆర్బీఐ పైవిధంగా స్పందించింది.
దేశంలో సుమారు 86శాతం చలామణిలో ఉన్న కరెన్సీని రద్దుచేస్తున్నట్టుఅకస్మాత్తుగా ప్రధాని చేసిన ప్రకటనతో ప్రజలు పలు అవస్థలు ఎదుర్కొన్న నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తాయి. సరైన సంసిద్ధత లేకుండానే ఈ నిర్ణయం చేశారంటూ కొన్ని విపక్షాలు సైతం ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయగా, ఆర్బీఐ స్వయంప్రతిపత్తి, ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ నాయకత్వంపైనా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నవంబర్‌ 8న జరిగిన రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై సాయంత్రం 5.30గంటలకు నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వు బ్యాంకు వెల్లడించింది. అయితే ఈ సమావేశంలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లైన ఆర్‌. గాంధీ, ఎస్‌.ఎస్‌. ముంద్రా, ఎన్‌.ఎస్‌. విశ్వనాథన్‌ సహా పలువురు ఆర్థిక నిపుణులు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ కూడా ఉన్నట్టు పేర్కొంది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఎన్ని రూ.2000, రూ.500 కొత్త నోట్లు రోజుకు ముద్రిస్తున్నారనే అంశాలను వెల్లడించలేదు. నోట్లరద్దు నిర్ణయం జరిగి 50 రోజులు గడుస్తున్నప్పటికీ నగదు కొరత ఇప్పటివరకు తీరలేదు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు.

No comments:

Post a Comment