Wednesday 28 December 2016

కొద్దిపాటి వ్యాయామం... సంపూర్ణ ఆరోగ్యం...
వారానికి 150 నిమిషాల వ్యాయామం చాలు
హైదరాబాద్‌: అందరిదీ ఉరుకుల పరుగుల జీవనమే. ఉదయం లేచింది మొదలు మళ్లీ నిద్రపోయే వరకు హడావిడి. వృత్తి, వ్యక్తిగత జీవితంలో బిజీబిజీ. ఈ క్రమంలో తమ గురించి...తమ ఆరోగ్యం గురించి పట్టించుకోక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు. నాలుగు పదులు దాటకుండానే చాలామంది హృద్రోగ, అధిక రక్తపోటు, మధుమేహం ఇతర అనేక సమస్యతో బాధపడుతున్నారు. కొందరు చిన్న వయస్సులోనే మృత్యువాత పడుతున్నారు. సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు తీవ్ర ఆవేదన మిగుల్చుతున్నారు. ఇప్పటికే నగరానికి మధుమేహ రాజధానిగా పేరుంది. దీనికితోడు 30-35 శాతం మంది అధిక రక్తపోటు సమస్యను, మరో 25 శాతం మంది అధిక బరువు సమస్య ఎదుర్కొంటున్నారు. మూత్ర పిండాల వైఫల్యం సరేసరి. చిన్న నిర్లక్ష్యం చక్కటి ఆరోగ్యంపై కోలుకోలేని ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ కమిటీ ప్రత్యేక అధ్యయనంతో కొన్ని సూచనలు చేసింది. ఏమిటవంటే... కొంచెం శారీరక శ్రమతో ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ‘హెల్త్‌, హ్యూమన్‌ సర్వీసెస్‌ ఫిజికల్‌ యాక్టివిటీ గైడ్‌లైన్స్‌ అడ్వైజరీ కమిటీ’ నివేదిక ఇదే విషయాన్ని తేల్చింది. వ్యాయామం ఎంత చేయాలి? దీని వల్ల ఏయే వ్యాధులను నియంత్రణలో పెట్టుకోవచ్చు...ఎంత శాతం నివారించవచ్చు...ఇలా అనేక అంశాలపై సూచనలు చేసింది. వారంలో కేవలం 150 నిమిషాలు శారీరక శ్రమ కలిగించే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల దాదాపు 12 వ్యాధుల నుంచి ముప్పు తప్పించుకోవచ్చునని సూచించింది. అలానే 20-80 శాతం వరకు ఆయా వ్యాధులను అదుపులో పెట్టుకోవచ్చు. అదీ వీలుకాకపోతే 75 నిమిషాలు పాటు కాస్త ఎక్కువ శ్రమ చేస్తే సరిపోతుందని పేర్కొంది. దీనిని పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుతం అనేక సమస్యలకు కారణమవుతోంది. ఇందుకు తెలంగాణ మినహాయిపు కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
ముందే చేయాలి
సాధారణంగా చాలామంది తమకేదైనా అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడుతుంటారు. ఉదయం పూట నడక, ఇతర వ్యాయామాలు చేసే వారు 5-7 శాతంలోపే ఉన్నారని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వచ్చిన తర్వాతే వ్యాయామానికి పలువురు ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఈ అలవాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీయకుండా హాయిగా జీవితాన్ని గడిపేయవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ సూచనలు పాటిస్తే..
* వ్యాయామం అంటే వేలకు వేలు చెల్లించి వ్యాయామశాలలకు వెళ్లాలనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అది అపోహ మాత్రమే. ఉదయపు నడక లేదంటే ఈత, బ్యాడ్మింటన్‌, తోటపని ఇలా ఏదైనా చేయవచ్చు.
* వారానికి 150 నిమిషాలు సాధారణ వ్యాయామం లేదంటే వారంలో 75 నిమిషాలు కాస్త ఎక్కువ శ్రమ కలిగించే వ్యాయామాలు చేయవచ్చు. యువకులైతే రెండూ చేసినా సరిపోతుంది.
* 65 ఏళ్లు పైబడిన వారైతే వారంలో కనీసం రెండు రోజులపాటు 45 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి.
* శరీరంలో కండరాలు పుష్టిగా ఉండేందుకు వారంలో రెండు రోజులు కొంత సమయం పాటు కేటాయించాలి. ఈత, పులప్స్‌, డిప్స్‌, చిన్నచిన్న బరువులు ఎత్తడం చేయాలి. దీనివల్ల కాళ్లు, తొడలు, చేతుల కండరాలు గట్టిపడతాయి.
* 30-45 నిమిషాల పాటు ఒకే చోట కూర్చోకూడదు. ప్రతి అరగంటకు ఒకసారి కుర్చీలో నుంచి లేచి 2-3 నిమిషాలు అటు ఇటు నడవాలి. ఉద్యోగులైనా ఇదే పద్ధతి పాటించాలి. 
* ముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండాలి. మితిమీరిన మద్యం అలవాటూ ప్రమాదకరమే.

No comments:

Post a Comment