Saturday, 31 December 2016

: యూపీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి.. బాబాయ్‌లతో ముఖ్యమంత్రి అఖిలేష్‌ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అవెంత వరకు వెళ్లాయంటే ముఖ్యమంత్రిగా ఉన్న కొడుకును పార్టీ నుంచి బహిష్కరించేందుకు సైతం ములాయం వెనుకాడలేదు.. గత కొంత కాలంగా తండ్రి.. కొడుకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తయారుచేసిన పోటాపోటీ అభ్యర్థుల జాబితాతో ఈ వ్యవహారం మరింతగా ముదిరిపోయింది. యూపీ అధికారపక్షంలో నెలకొన్న తాజా సంక్షోభం వెనుక అపర్ణా యాదవ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ.. ఈ అపర్ణా యాదవ్‌ ఎవరు? ఆమెకు సమాజ్‌వాదీ సంక్షోభానికి కారణం ఏమిటి? ఆమెకు ఎందుకంత ప్రాధాన్యం అన్న అంశాల్ని చూస్తే..
యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం తండ్రీ కొడుకులు విడివిడిగా పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించడంతో మరోసారి సంక్షోభానికి తెరలేచింది. అయితే అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించిన జాబితాలో లఖ్‌నవూ కంటోన్మెంట్‌ సీటు అభ్యర్థి పేరు లేకపోవటం రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురి చేశాయి. వారు అంతగా ఆశ్చర్యపోవటానికి కారణం లేకపోలేదు. ఆ సీటు అభ్యర్థిగా ఏడాది కిందటే అపర్ణాయాదవ్‌ పేరును ఎస్పీ చీఫ్‌ ములాయం రిజర్వు చేశారు. అలాంటిది అఖిలేశ్‌ మాత్రం తాను సమర్పించిన జాబితాలో అపర్ణ పేరును చేర్చలేదు.
ఆమె ఎవరంటే..?
ఇరవైఆరేళ్ల వయసున్న అపర్ణా యాదవ్‌ ఎవరోకాదు ములాయం సింగ్‌ యాదవ్‌ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ భార్య. ప్రతీక్‌ యాదవ్‌ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ వ్యాపారంలో ఉండటంతో అపర్ణాయాదవ్‌ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఆమెను లఖ్‌నవూ కంటోన్మెంట్‌ సీటుకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ స్థానంలో రీటా బహుగుణా జోషీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. లఖ్‌నవూ ప్రధాన సీటును ఎస్పీ ఇంతవరకు గెలుచుకోలేదు. అందుకే ఆమె రాజకీయ అరంగేట్రం సాఫీగా సాగేందుకు ఈ సీటును కేటాయించారు. ఏడాది నుంచే ఆమె తన ప్రచారాన్ని మొదలు పెట్టారు.
ఆమె వ్యూహం ఏంటీ..?
ఎస్పీలో యువనేతగా ఎదగడమే లక్ష్యంగా అపర్ణ రాజకీయాల్లోకి దిగుతున్నారు. అవసరమైతే అఖిలేష్‌ స్థానాన్ని ఆమె భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. కాలం కలిసి వస్తే.. అఖిలేశ్‌ను తోసిరాజనేందుకు వీలుగా అపర్ణకు అధినేత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెబుతుంటారు. ప్రస్తుతం ఆమె శివ్‌పాల్‌ యాదవ్‌ వర్గంలో ఉన్నారు.
అఖిలేష్‌ను ములాయం కుటుంబ సభ్యులు లక్ష్యంగా చేసుకున్నారంటూ కొన్నాళ్ల కిందట ఎస్పీ నేత ఉదయ్‌వీర్‌ సింగ్‌ ఓ లేఖను విడుదల చేశారు. ఇది పరోక్షంగా అపర్ణా యాదవ్‌ను ఉద్దేశించిందన్న అభిప్రాయం ఉంది. ఈ లేఖపై ములాయం.. సాధనగుప్తాలు అగ్గి మీద గుగ్గిలం కావటం ఒక ఎత్తు అయితే.. అఖిలేష్‌కు ములాయంకు మధ్య విభేదాలను అపర్ణ భర్త ప్రతీక్‌ ఎగదోస్తున్నారని యూపీ సీఎం వర్గం ఆరోపిస్తోంది.

 మోదీ మద్దతుదారు..!
అపర్ణ ప్రధాని నరేంద్రమోదీకి మద్దుతుదారు. ఆమె ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట బహిరంగంగానే చెప్పారు. 2015లో ములాయం మనవడి వివాహానికి మోదీ హాజరైనప్పుడు భర్తతో కలిసి వెళ్లి సెల్ఫీ దిగారు. భాజపా కార్యక్రమాలకు కూడా ఆమె మద్దతు ఇస్తుంటారు.

ఆమెకు పోటీ ఎవరు?
అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ను అపర్ణాయాదవ్‌కు ప్రత్యర్థిగా పలువురు అభివర్ణిస్తుంటారు. పార్టీ కార్యక్రమాల్లో బాగా కష్టపడతారన్న పేరు డింపుల్‌కు ఉంది. కుటుంబంలో చోటు చేసుకున్న లుకలుకలు ఇప్పుడు పార్టీని సంక్షోభం దిశగా నడిపించటమే కాదు.. ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు విజయం మీద ప్రభావితం చూపించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చి..
యూపీ రాజకీయ సంచలనమైన అపర్ణా యాదవ్‌ బిష్త్‌ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి అరవింద్‌ సింగ్‌ బిష్త్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా లఖ్‌నవూ బ్యూరో చీఫ్‌. అపర్ణ లఖ్‌నవూలోని ఓ ప్రఖ్యాత పాఠశాలలో చదువుకున్నారు. అక్కడే ప్రతీక్‌ యాదవ్‌ కూడా చదువుకున్నారు. కానీ అప్పట్లో ప్రతీక్‌ యాదవ్‌కు ములాయంకు మధ్య సంబంధం లోకానికి తెలియదు. వీరి బంధాన్ని 2007లో ములాయం బయటపెట్టారు. అపర్ణ, ప్రతీక్‌లు తొలుత సన్నిహిత మిత్రులు. తర్వాత వీరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రతీక్‌ నేపథ్యం తెలియకుండానే దగ్గరయ్యారు. ఆమె తొలిసారి ప్రతీక్‌ తల్లివద్దకు వెళ్లినప్పుడే ములాయం కుమారుడన్న విషయం తెలిసింది. అప్పట్లో వీరి ప్రేమను అపర్ణ తండ్రి అరవింద్‌ అంగీకరించలేదు. వీరిద్దరు ఇంగ్లాండ్‌లో ఉన్నత చదువులు అభ్యసించారు. అపర్ణ అంతర్జాతీయ సంబంధాల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయగా ప్రతీక్‌ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్సీ చేశారు. అపర్ణ, ప్రతీక్‌ల పెళ్లికి ములాయం అంగీకరించకపోవడంతో.. సాధన గుప్తా భర్తను ఒప్పించాల్సి వచ్చింది. అనంతరం వీరి పెళ్లిని ములాయం ధూంధాంగా నిర్వహించారు. ఇది ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే అత్యంత వైభవంగా జరిగిన పెళ్లిగా చెప్పుకొంటారు.

 

Friday, 30 December 2016

తండ్రీకొడుకుల సవాల్ : పార్టీ నుంచి సీఎం అఖిలేష్ బహిష్కరణ

స‌మాజ్‌వాదీ పార్టీలో ముస‌లం ముదిరింది. క‌న్న కొడుకునే పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు పార్టీ అధినేత ములాయం సింగ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు బాబాయ్ అబ్బాయ్ మ‌ధ్యే న‌డిచిన వార్ ఇక తండ్రీ కొడుకుల కొట్లాట‌గా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాది అభ్య‌ర్థులు జాబితాతో విబేధించిన సీఎం అఖిలేష్ యాద‌వ్, త‌న సొంత అభ్య‌ర్థుల‌తో మ‌రో జాబితాను విడుద‌ల చేశారు. దీంతో అగ్గిరాజేసుకుంది.
పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందున అఖిలేష్‌, రాంపాల్ యాద‌వ్‌ల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ములాయం. నోటీసులు జారీ చేసిన కాసేప‌టికే ప్రెస్‌మీట్ పెట్టి స‌మాజ్‌వాదీ పార్టీ  పెద్దాయన సీఎం అఖిలేష్‌ను, రాంగోపాల్‌ను పార్టీ నుంచి 6ఏళ్లు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
రాంగోపాల్ మొద‌టి నుంచి పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, అఖిలేష్‌ను సైతం త‌ప్పుదోవ ప‌ట్టించాడ‌ని ములాయం చెప్పారు. అఖిలేష్‌ను స‌స్పెండ్ చేయ‌డం బాధించింద‌ని అయితే పార్టీ మేలు కోరి ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ములాయం అన్నారు. దీంతో అఖిలేష్ సీఎం ప‌ద‌వి ప్ర‌శ్నార్థ‌క‌మైంది. దీంతో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు వేడెక్కాయి. అఖిలేష్ మ‌రో పార్టీ పెడ‌తార‌న్న వార్త‌లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి.
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం పెమా ఖండూను ఆ పార్టీ ఎమ్మెల్యేలే స‌స్పెండ్ చేసిన కొన్ని గంట‌ల‌కే… స‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన సీఎం అఖిలేష్‌ను పార్టీ చీఫ్ తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

వివాదాస్పద ఇళ్ల నుంచీ ఆస్తి పన్ను
జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం
ఇలాంటివి మహా నగరంలో లక్షకు పైగా ఇళ్లు
దీనివల్ల యాజమాన్యపు హక్కు ఇచ్చినట్లు కాదు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వివాదంలో ఉన్న లక్షకుపైగా ఇళ్లకు ఆస్తి పన్ను వేసి వసూలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల బల్దియాకు ఏటా రూ.40 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్‌ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్దాలుగా వివాదాల మధ్య నలుగుతున్న ఇళ్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. మియాపూర్‌లోని గోకుల్‌ ట్రస్టు పరిధిలో దాదాపు రెండువేల ఇళ్ల వరకు ఉన్నాయి. ఈ స్థల వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇంతలో కొంత భూమి తమదని ప్రభుత్వం వాదిస్తోంది. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల మధ్య కూడా వివాదం ఉంది. దీంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి బల్దియా అధికారులు అధికారికంగా అనుమతి ఇవ్వడం లేదు. అయినప్పటికి అక్కడ వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగిపోతూనే ఉంది. హైటెక్‌ సిటీకి దగ్గరలోని గురుకుల్‌ ట్రస్టు పరిధిలో, హఫీజ్‌పేటలో కూడా ఇలానే. ఇలాంటివి నగరంలో 1,21,640 ఇళ్లు ఉన్నట్టు లేక్క తేల్చారు. 49,240 ఇళ్లు ప్రభుత్వ భూమిలోనూ, 52,934 ఇళ్లు నోటరీ భూముల్లో, 8,111 ఇళ్లు వక్ఫ్‌ భూముల్లో, 3,036 ఇళ్లు చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో, 1480 ఇళ్లు నాలాల పరిధిలో, 1338 ఇళ్లు దేవాదాయ భూముల్లో మిగిలినవి ఇతర వాటిల్లో ఉన్నట్టు తేల్చారు. ఇలాంటి వివాదాస్పద భూముల్లో ఇళ్లను నిర్మించుకున్న యజమానుల నుంచి ఎటువంటి ఆస్తి పన్నును వసూలు చేయడం లేదు. ఆస్తి పన్ను వేస్తే వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అధికారులు వాటి జోలికి వెళ్లలేదు. ఇందులో చాలా ఇళ్లు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బల్దియా కమిషనర్‌ బి.జనార్దనరెడ్డి దీనిపై అధికారులతో చర్చించారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారం ఆస్తి పన్ను విధించినంత మాత్రాన సంబంధిత వివాదాస్పద ఇంటిపై యాజమాన్యపు హక్కు దక్కదని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ విషయం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తెచ్చారు. వీరి నుంచి ఇంటి పన్ను వసూలు చేయడానికి మంత్రి కూడా ఆమోదం తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం నుంచి వర్తించేలా ఇంటి పన్నును వసూలు చేస్తారు. అనుమతి ఇచ్చిన ఇళ్లకు వసూలు చేస్తున్న మొత్తం కంటే రెండు రెట్లు అధికంగా వీరి నుంచి ఆస్తి పన్నును వసూలు చేస్తారు. రెండింతల పన్ను వసూలు చేయడం వల్ల ఏటా రూ.40 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా.

బెజవాడ నుంచి కాశీకి విమాన సేవలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం టిక్కెట్‌ ధర రూ.2500లే

అమరావతి: విజయవాడ నుంచి వారణాసి(కాశీ)కి నేరుగా ప్రత్యేక విమానం అందుబాటులోనికి రానుంది. కేవలం రూ.2500 టిక్కెట్‌ ధరతో కాశీకి చేరుకునేలా ఫిబ్రవరి 17 నుంచి సర్వీసును అందుబాటులోకి తెస్తున్నారు. 180మంది ప్రయాణికులు పట్టే భారీ విమానాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ మీదుగా ఈ సర్వీసు వారణాసి చేరుకుంటుంది. ఇప్పటివరకూ వారణాసికి విమానంలో వెళ్లాలంటే ఇక్కడి నుంచి ఎయిర్‌ఇండియా సర్వీసులో దిల్లీకి చేరుకుని అక్కడి నుంచి మరోటి మారాల్సి వస్తోంది. రైలు, రోడ్డు మార్గంలో వెళ్లేందుకు 30గంటల పైనే పడుతోంది. నేరుగా విమాన సర్వీసు అందుబాటులోనికి రావడం వల్ల మూడు నాలుగు గంటల్లోనే కాశీకి చేరుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం రైలులో వెళ్లాలన్నా 30గంటల పైగా సమయంతో పాటు, సెకండ్‌ ఏసీలో వెళ్తే రెండు వైపులకూ కలిపి రూ.5,140 అవుతోంది. అదే బస్సులో వెళితే దీనికి రెట్టింపవుతోంది.

ఆన్‌లైన్‌ హంగామా

చిత్రసీమకి సామాజిక అనుసంధాన వేదికలు కీలకంగా మారాయి. తారలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు, సినిమాల సమాచారం పంచుకోవడం ఎక్కువైంది. యువ తారలతో పాటు సీనియర్లు కూడా ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నారు. కమల్‌హాసన్‌లాంటి నటులు ఈ ఏడాదే ట్విట్టర్‌లోకి అడుగుపెట్టారు. చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’, బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కూడా ఆన్‌లైన్‌లో పెద్దయెత్తున హంగామా చేస్తున్నాయి. చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రంలోని పాటల్ని ఒకొక్కటిగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు... పాట ఇప్పటికే 70 లక్షల మంది చూశారు. బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌ కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఏడాది పవన్‌కల్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, అల్లు అర్జున్‌ ‘సరైనోడు’, ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’, రామ్‌చరణ్‌ ‘ధృవ’, నాగచైతన్య ‘ప్రేమమ్‌’, వెంకటేష్‌ ‘బాబు బంగారం’, ‘గురు’ చిత్రాలకి సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా ఆన్‌లైన్‌ని ఓ వూపు వూపేశాయి. రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ వేదికగా పవన్‌కల్యాణ్‌తో పాటు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలపైన చేసిన కొన్ని వ్యాఖ్యలు అలజడి సృష్టించాయి.

దేశసంపదను భక్షిస్తున్న ఎలుకను పట్టాల్సిందే అందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీ స్పష్టీకరణ మూడేళ్ల క్రితం కుంభకోణాలతో నష్టంపైనే చర్చంతా ఎంత తిరిగొచ్చిందన్నదే ఇప్పుడు ప్రజల్లో ముచ్చట అని వెల్లడి ఆధార్‌ అనుసంధానిత చెల్లింపులకు ‘భీమ్‌’ యాప్‌ ప్రారంభం

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ దుయ్యబట్టారు. దేశ సంపదను భక్షిస్తున్న ఎలుకను పట్టుకునేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం పత్రికల నిండా బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం వంటి వాటి కారణంగా ఎంత మొత్తం నష్టం వాటిల్లిందన్నదాని గురించే కథనాలుండేవని, ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో ఎంత మొత్తం జమయిందన్నదానిపై ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారని అన్నారు. డిజిటల్‌ నగదు ఉద్యమ విజయోత్సవ కార్యక్రమం డిజిధన్‌ మేళాలో శుక్రవారం ప్రధాని పాల్గొని ప్రసంగించారు. వేలి ముద్ర ఆధారంగా ఆధార్‌ అనుసంధాన,ంతో చెల్లింపులకు వీలు కలిగించే కొత్త యాప్‌ ‘భీమ్‌’(BHIM-Bharat Interface for Money)ను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. పేదలు, అణగారిన వర్గాల ఉన్నతికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ చేసిన కృషికి గుర్తింపుగా ఆయన పేరును ఈ యాప్‌నకు పెట్టారు. ప్రస్తుతం ఈ యాప్‌ భద్రతాంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, రెండు వారాల్లో దేశవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని వెల్లడించారు.
ఆశావాదులకు వేల అవకాశాలు
‘‘కొంత మంది నిరాశావాదులు. వారు తమ దైనందిన జీవితాన్ని నిరాశావాదంతో ప్రారంభిస్తారు. నిరాశావాదికి నా వద్ద మందు లేదు. కానీ ఆశావాదులకు నా వద్ద వేల అవకాశాలున్నాయి.’’ అని ప్రధాని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సాధించిందేమీ లేదని, కొండను తవ్వి ఎలుకను పట్టారని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యపై చురకలు వేస్తూ ‘‘పేదల సంపదను భక్షిస్తున్నందున నేను ఎలుకను బయటకు రప్పించాలనుకున్నాను. దీనిపై మేము వేగిరంగా పని చేస్తున్నాం.’’ అని అన్నారు. ‘‘మూడేళ్ల క్రితం కుంభకోణాల్లో ఎంత నష్టం వాటిల్లిందన్నదే వార్తల ప్రధానాంశంగా ఉండేది. ఇప్పుడు వాపసు ఎంత వస్తున్నదానిపైనే చర్చంతా. ఇదీ తేడా.’’ అని ప్రధాని అన్నారు.
అవినీతి, నల్లధనం సమస్యను ఎదుర్కోవడానికి ప్రజలు కష్టపడి పని చేయడం వల్లే 86శాతం నగదును మార్చగల్గామని చెప్పారు. ‘‘ప్రజలు చూపించిన ఈ శక్తి సామాన్యమైనది కాదు. ఈ శక్తి దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది.’’ అని అన్నారు. పేదలకు దేశ వనరులు, సంపదపై అధికారం ఉందన్నారు. ‘‘ఈ యాప్‌ ద్వారా భారతరత్న భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ పేరు భారత ఆర్థికవ్యవస్థలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తుంది.’’ అని ప్రధాని చెప్పారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న భారత్‌.. ఎన్నికల్లో ఈవీఎంలను ఎలా ఉపయోగిస్తుందని ప్రపంచం ఆశ్యర్యపోయిందని ప్రధాని గుర్తు చేశారు. ‘‘భారత్‌ యువ దేశం. 65శాతం మంది వయస్సు 35 సంవత్సరాల లోపే. వారంతా డిజిటల్‌ లావాదేవీలకు మళ్లితే అది చరిత్రాత్మకమే అవుతుంది. భారత్‌ ముఖచిత్రమే మారిపోతుంది. భీమ్‌ యాప్‌.. పేదలు, దళితులు, రైతులు, గిరిజనులకు సాధికారికతను కల్పిస్తుంది.’’ అని చెప్పారు. ప్రభుత్వం 100 కోట్లకు పైగా ఆధార్‌ సంఖ్యలను జారీ చేసిందని, వందకోట్లకు పైగా మొబైల్‌ ఫోన్లు దేశంలో ఉన్నాయని, ఒకసారి దేశం డిజిటల్‌లోకి మారితే చరిత్రను సృష్టిస్తుందని ప్రధాని అన్నారు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి రోజుకు కనీసం ఐదు డిజిటల్‌ లావాదేవీలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భీమ్‌ యాప్‌ను ఉపయోగించి ప్రధాని మోదీ ఖాదీ గ్రామోద్యోగ్‌ నుంచి కశ్మీరీ శాలువా, రుమాలు కొన్నారు.

ఇంటర్నెట్ లేకుండా భీమ్ యాప్ :మోడీ

ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో జరిగిన డిజిధన్ కార్యక్రమంలో బీమ్ యాప్ ను ప్రారంభిస్తూ వచ్చే ఏడాది నుంచి ప్రతి ఒక్కరూ రోజుకు 5 డిజిటల్ లావాదేవీలు జరిపితే చాలు దేశం డిజిటల్ మయం మవుతుందన్నారు. దేశంలోని 600 మిలియన్ల మంది భీమ్ యాప్ కు అలవాటు పడతారన్నారు. నగదు, అవినీతి రహిత దేశంగా ఇండియా మారిపోతుందన్నారు. రెండు ఫోన్లు పెట్టుకొని డిజిటల్ పేమెంట్ చేయడం లేదా అని అందరూ అడిగే పరిస్థితి తెచ్చుకోవదన్నారు ప్రధాని.
మూడేళ్ల క్రితం దేశం ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. బంగారు పాత్రల్లో తినే దేశాన్ని పేదరికంలోకి నెట్టేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని తెలిపారు మోడీ. జనవరి 1 నుంచి చూడండి దేశం మొత్తం భీమ్ యాప్ ద్వారానే డిజిటల్ లావాదేవీలు జరగుతాయన్నారు. కొద్ధి రోజుల్లోనే దేశం మొత్తం డిజిటల్ మయం అయిపోతుందన్నారు. భారత్ లో చెలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ ని సిస్టమ్ నుంచి తొలగించ గలిగాం అన్నారు. దేశ ఖజానా..పేద ప్రజల చేతుల్లోనే ఉండాలన్నారు.


 డిజిటల్‌ ‘భీమ్‌’ యాప్‌ ప్రత్యేకతలు

 ప్రపంచంలోనే అత్యంత పెద్ద అద్భుతంగా భీమ్‌ యాప్‌ అవతరించబోతోంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అన్ని లావాదేవీలు భీమ్‌ యాప్‌ ద్వారానే జరుగుతాయి.’’
-ప్రధాని మోదీ
 
 
 
డిజిటల్‌ లావాదేవీల దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. వినియోగదారులు తాము కొన్న వస్తువులకు, పొందిన సేవలకు చేయాల్సిన చెల్లింపులను డిజిటల్‌ పద్ధతిలో అత్యంత సరళతరం చేసే యాప్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ ద్వారా డబ్బు వేరొకరికి బదిలీ చేయవచ్చు. వేరొకరి నుంచి స్వీకరించవచ్చు. సెకన్ల వ్యవధిలోనే లావాదేవీలు పూర్తవుతాయి. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) భీమ్‌ పేరుతో దీన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం భద్రతాంశాల పరిశీలనలో ఉంది. మరో రెండువారాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. బ్యాంకు ఖాతాను ఆధార్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఈ యాప్‌ పని చేస్తుంది. వస్తువులు కొన్న, సేవలు పొందిన వినియోగదారులు తమ వద్ద ఫోన్‌ కానీ, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కానీ లేకుండా కూడా వ్యాపారులకు డిజిటల్‌ డబ్బు చెల్లించవచ్చు. వ్యాపారుల స్మార్ట్‌ఫోన్లలో భీమ్‌ యాప్‌ ఉంటేచాలు. ఆ ఫోన్‌ను బయోమెట్రిక్‌ రీడర్‌కు అనుసంధానిస్తారు. ఆ యాప్‌లో వినియోగదారుడు తన ఆధార్‌ సంఖ్యను కొట్టవలసి ఉంటుంది. అనంతరం ఏ బ్యాంకు ద్వారా నగదు చెల్లించాలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌ పరికరంపై వేలిముద్రను స్కాన్‌ చేయడం ద్వారా ఆ వినియోగదారుడే అసలు ఖాతాదారుడా కాదా అని నిర్ధారణ అవుతుంది. అంటే వేలిముద్రే పాస్‌వర్డ్‌గా పని చేస్తుంది. ఈ యాప్‌ను ఉపయోగించుకున్నందుకు ఎటువంటి సేవా రుసుములుండవు. వ్యాపారులు డిజిటల్‌ లావాదేవీలకు మళ్లడానికి ఇది దోహదం చేయనుంది. ప్రస్తుతం డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు తీసుకోవాలంటే మాస్టర్‌కార్డు, వీసా వంటి సర్వీసు ప్రొవైడర్లకు రుసుములు చెల్లించాల్సి వస్తోంది. భీమ్‌ యాప్‌లోని ప్రధాన అంశాలు
లభ్యత ఎక్కడ?: గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాండ్రాయిడ్‌ ఫోన్లకయితే వర్షన్‌ 8, అంతకన్నా ఎక్కువ వర్షన్లుకు, ఐవోఎస్‌ స్మార్ట్‌ఫోన్లకయితే వర్షన్‌ 5, అంతకన్నా ఎక్కువ వర్షన్లకు అందుబాటులో ఉంది. ఇతర ప్లాట్‌ఫాంలకు త్వరలో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని భాషల్లో అందుబాటులోకి రావచ్చు.
యాప్‌ సైజ్‌: దాదాపు 2ఎంబీ
లావాదేవీల గరిష్ఠ పరిమితి
రోజుకు కనీసం రూ.నుంచి గరిష్ఠంగా రూ.20వేల వరకు బదిలీ చేసుకోవచ్చు. ఒక లావాదేవీపై గరిష్ఠ పరిమితి రూ.పదివేలు.
ఎలా పని చేస్తుంది?
యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక తమ బ్యాకు ఖాతా వివరాలను నమోదు చేసి ఆ ఖాతాకు యీపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాలి. యాప్‌ను ఉపయోగించేవారి మొబైల్‌ నంబరే వారి పేమెంట్‌ చిరునామా అవుతుంది. యూపీఐ పిన్‌ను పొందాలంటే మెయిన్‌ మెనూకు వెళ్లి అందులో బ్యాంకు ఖాతాల ఆప్షన్‌లోకి వెళ్లాలి. ప్రాధాన్య బ్యాంకు ఖాతాకు యూపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం డెబిట్‌/ఏటీఎం కార్డులోని చివరి 6 అంకెలు, కార్డు గడువు ముగిసిపోయే తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ ఫోన్‌కు వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి యూపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాలి. అప్పటి నుంచి ఈ యాప్‌.. డబ్బు పంపడం, స్వీకరించడం వంటి లావాదేవీలను అనుమతిస్తుంది.
ప్రస్తుతానికి ఒక బ్యాంకుఖాతాకే పరిమితం
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సహా పలు బ్యాంకులు భీమ్‌ యాప్‌ ద్వారా లావాదేవీలను అనుమతిస్తున్నాయి. ఇతర యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) అప్లికేషన్లు, బ్యాంకు ఖాతాలతో పరస్పరం సమాచారాన్ని అందిపుచ్చుకునేలా భీమ్‌ను అభివృద్ధి చేశారు. అయితే ప్రస్తుతానికి ఏదైనా ఒక బ్యాంకు ఖాతాకే భీమ్‌ను అనుసంధానించుకోవచ్చు. యాప్‌లో బ్యాంకు ఖాతాను అనుసంధానించేటప్పుడు డీఫాల్ట్‌ ఖాతాను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరో బ్యాంకు ఖాతాను అనుసంధానించాలనుకుంటే మెయిన్‌ మెనూలోకి వెళ్లి డీఫాల్ట్‌ ఖాతాను మార్చుకోవాల్సి ఉంటుంది.