Tuesday 29 November 2016

చ్చే నెల 30లోపు రద్దు చేసిన రూ.500, 1000 నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకోవాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఆర్‌.నాగరాజు స్పష్టం చేశారు. పెళ్లి నిర్వహణకు రూ.2.50 లక్షల చొప్పున ఉపసంహరించుకోవచ్చని ఆర్బీఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు జిల్లాలో అమలు చేస్తామన్నారు. సోమవారం ‘ms world ’ ఆధ్వర్యంలో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఫోన్‌ ఇన్‌’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల నుంచి విశేష స్పందన వచ్చింది. ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు 80 పైగా ఫిర్యాదులు రాగా... 50 మందితో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నేరుగా మాట్లాడి సమాధానాలు ఇచ్చారు. సలహాలు, సూచనలతో భరోసా కల్పించారు. బ్యాంకుల్లో రూ.2.50 లక్షల వరకు జమ చేసుకోవచ్చని.. అంతకు మించితే...ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే.. ప్రతి పైసాకు లెక్క చూపాలన్నారు.


లెక్కలు చూపితే.. డబ్బుకు భరోసా
కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో అన్నివర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకులో గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఏటీఎంలు పూర్తిస్థాయిలో పనిచేయక సమస్య మరింత జఠిలంగా మారింది. బ్యాంకులో ఒకేసారి రూ.24 వేల వరకు ఇస్తామని ఆర్‌బీఐ చెప్పినా జిల్లాలోని చాలాచోట్ల అమలు కావడం లేదు. నగదు లేదంటూ ఖాతాదారులను వెనక్కి పంపుతున్నారు. చేతిలో ఉన్న డబ్బు ఖాతాలో జమ చేస్తే ఎక్కడ ఆదాయపన్ను అధికారులు అడుగుతారోనని పలువురిలో ఆందోళన... ఇదే అవకాశంగా రద్దయిన నోట్లు మార్పిడి చేయిస్తామంటూ కమీషన్‌ ఏజెంట్లు మభ్యపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఆర్‌.నాగరాజుతో సోమవారం నిర్వహించిన ms world
’ ఫోన్‌ఇన్‌కు అనూహ్య స్పందన లభించింది. గంటన్నరపాటు నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు ఫోన్‌ చేశారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని సమాధానాలు ఇచ్చారు. ప్రజల సమస్యలు... వాటికి సమాధానాలు ఇలా... సమస్య: రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వడం లేదు. యాసంగి సాగుకు ఇబ్బంది అవుతోంది. న్యాయం చేయండి. ఇటీవల వరిధాన్యం అమ్మాం. సంబంధిత వ్యాపారి డిసెంబరు తర్వాత ఇస్తానని హామీ ఇచ్చారు. మా పరిస్థితి ఏంటి? - రాజేశ్వరరావు, సర్దన, హవేలి ఘనపూర్‌, వసంత లక్ష్మి, ఇస్నాపూర్‌, పటాన్‌చెరు ఎల్‌డీఎం: డిసెంబర్‌ 30లోగా ఖాతాలో డబ్బులు వేసుకోవాలి. సీనియర్‌ సిటిజన్ల మాదిరిగా రైతులకు త్వరలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రుణమాఫీతో పాటు పంట రుణాలు ఇచ్చేలా ప్రత్యేక దృష్టి సారిస్తాం.
సమస్య: వ్యాపారపరంగా వివిధ రూపాల్లో రోజూ ఆదాయం వస్తుంటుంది. వరి ధాన్యం, ఇతరత్రా లావాదేవీల ద్వారా ఆదాయం వచ్చింది. విశ్రాంత ఉద్యోగులం కావడంతో పింఛను రూపంలో రూ. లక్షలు ఉన్నాయి. వాటిని బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చా? ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు బ్యాంకుల్లో, లాకర్లో జమ చేశాం. బంగారాన్ని, నగదును దాచిపెట్టాం. ఆదాయపు శాఖ అధికారులు మాపై చర్యలు తీసుకుంటారా? మాపై పన్ను విధించే అవకాశం ఉందా? - బాలు(దుద్దెడ-కొండపాక), వెంకటేశ్వర్లు(అందె-మిరుదొడ్డి), పోచన్న(నర్సాపూర్‌), శ్రీనివాస్‌(తడ్కల్‌), కిశోర్‌, వెంకటేశ్‌(టేక్మాల్‌), సురేశ్‌, గోవర్దనగిరి(హుస్నాబాద్‌), సమ్మిరెడ్డి(చేర్యాల), శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రావు(సంగారెడ్డి), రాజు(చంద్లాపూర్‌-చిన్నకోడూర్‌), నర్సింగ్‌రావు(సిద్దిపేట), పాండురంగారెడ్డి( జహీరాబాద్‌), గుణకార్‌(జోగిపేట), నాందేవ్‌(ఇస్నాపూర్‌), ఎం.వెంకటేశం(నారాయణఖేడ్‌), మహేందర్‌రెడ్డి(సీతారంపల్లి-సిద్దిపేట) ఎల్‌డీఎం: మీరు ఆధారాలు చూపితే ఎంతయిన బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు. జమ చేసిన ప్రతి పైసాకు లెక్క చూపాల్సి ఉంటుంది. మీ వద్ద నగదుకు లెక్కలు చూపితే సరిపోతుంది. రూ.2.5 లక్షలు దాటితే స్లాబ్‌ల వారీగా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చినా భయపడాల్సిన అవసరం లేదు.
సమస్య: డిసెంబరు 4న మా చెల్లెలు పెళ్లి ఉంది. స్థానిక బ్యాంకుకు వెళితే వారు రూ.2.5 లక్షలు ఇవ్వడం లేదు. ఆర్‌బీఐ ఆదేశాలు రాలేదని తిప్పుతున్నారు. పెళ్లి గడువు సమీపిస్తోంది. మా ఇంట్లో అందరికీ టెన్షన్‌ పట్టుకుంది. బ్యాంకు అధికారులు న్యాయం చేసేలా చూడాలి? - నితిన్‌, సదాశివపేట ఎల్‌డీఎం: సోమవారం నుంచి రూ. 2.5 లక్షలు ఇవ్వాలని ఆర్‌బీఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. స్థానిక బ్యాంకు అధికారులతో మాట్లాడి మీకు డబ్బులు ఇప్పిస్తాం. ఈ ఒక్క బ్యాంకులోనే నగదు డ్రా చేసుకుంటున్నట్లుగా డిక్లరేషన్‌ రాసి ఇస్తే చాలు. నగదు ఇస్తారు.
సమస్య: కరెంట్‌ బ్యాంకు ఖాతాల్లో ఎంతవరకు నగదు జమ చేసుకోవచ్చు. ఎంతవరకు డ్రా చేసుకునే అవకాశం ఉంది? - శ్రీనివాస్‌, దుద్దెడ, కొండపాక ఎల్‌డీఎం: కరెంట్‌ బ్యాంకు ఖాతాల నుంచి వారానికి రూ. 50 వేలు డ్రా చేసుకోవచ్చు. జమకు పరిమితి లేదు.
సమస్య: ఏటీఎం కేంద్రంలో నగదు డిపాజిట్‌ చేయడానికి ఇబ్బంది అవుతోంది. ప్రత్యేకంగా నగదు పెట్టేందుకు ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేసి ఖాతాదారులను ఆదుకోండి? - జాకీర్‌పాష-జోగిపేట, హరీశ్‌-అందోలు ఎల్‌డీఎం: డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు ఏటీఎం కేంద్రాల కొరత ఉంది. అందులో కూడా రూ. 49 వేలు మాత్రమే జమ చేయాలి. అదే బ్యాంకులో అయితే రూ. 49 వేలలోపు జమకు ఎలాంటి షరతులు లేవు. దానికి మించితే పాన్‌కార్డు అవసరం.
సమస్య: జిన్నారం మండలం గడ్డపోతారంలో ఏపీజీవీబీ ఒకటే ఉంది. ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేయాలంటే గండిమైసమ్మకు వెళ్లాల్సి వస్తోంది. అదనపు ఏటీఎంలు ఏర్పాటు చేయించాలి. లేకపోతే సంచార ఏటీఎంలను ఏర్పాటు చేయించాలి? - రాజు, ఎంపీటీసీ సభ్యుడు, పద్మారావు, గడ్డపోతారం, జిన్నారం మండలం ఎల్‌డీఎం: ఎస్‌బీఐ ఆధ్వర్యంలో మాత్రమే సంచార ఏటీఎంలు ఉన్నాయి. మిగిలిన బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని కోరతాం.
సమస్య: జన్‌ధన్‌ ఖాతా ఉంది. ఇందులో ఎంతవరకు జమ చేసుకోవచ్చు? - గురుస్వామి, కరస్‌గుత్తి, నాగల్‌గిద్ద మండలం, స్వామి, ధర్మాజిపేట, దుబ్బాక ఎల్‌డీఎం: జన్‌ధన్‌ ఖాతాలో రూ.50 వేల వరకు మాత్రమే వేసుకోవచ్చు. ఎక్కువైతే సాధారణ ఖాతా కింద మార్చుకోవాలి.
సమస్య: డీసీసీబీ బ్యాంకులో పాత నోట్లు తీసుకునేలా చూడాలి? - నరేందర్‌, మంగల్‌పేట, నారాయణఖేడ్‌ ఎల్‌డీఎం: ఆర్‌బీఐ నుంచి ఆదేశాలు రాలేదు. వారి ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటాం.
సమస్య: మేం వ్యాపారం నిర్వహిస్తాం. నిత్యం ఆన్‌లైన్‌ ద్వారా పలువురి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంటాం. ఇటీవల బ్యాంకుల్లో ఆన్‌లైన్‌ ఖాతాలకు నిలుపుదల చేశారు. తీవ్ర ఇబ్బంది పడుతున్నాం? - మహేశ్వర్‌, సంగారెడ్డి ఎల్‌డీఎం: మీ పాన్‌, ఆధార్‌ కార్డు నెంబర్‌ బ్యాంకులో సమర్పించి వేరే వారి బ్యాంకు ఖాతాల్లో ‘ఆన్‌లైన్‌’ ద్వారా నగదు జమ చేయవచ్చు.
సమస్య: బ్యాంకులో బంగారంపై రుణం కట్టేశాను. తర్వాత రూ.2.5 లక్షలు బ్యాంకులో జమ చేయవచ్చా? - ఆంజనేయులు, సంగారెడ్డి ఎల్‌డీఎం: బ్యాంకు రుణం కూడా లెక్కలోకి తీసుకుంటారు. బ్యాంకులో జమ చేసిన నగదుతో పాటు బ్యాంకు రుణం చెల్లింపు కలిపి రూ.2.50 లక్షలు దాటవద్దు. దాటితే ఆదాయపు పన్ను చెల్లించాలి.
సమస్య: గతంలో బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేశాను. మళ్లీ రూ.2.50 లక్షలు డిపాజిట్‌ చేయవచ్చా? - రాజుగౌడ్‌, మెదక్‌ ఎల్‌డీఎం: గతంలో డిపాజిట్‌ ఉంటే సంబంధం లేదు. నోట్లు రద్దయిన తర్వాత మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు.
సమస్య: నా వద్ద రద్దయిన నోట్లు ఉన్నాయి. బ్యాంకులో అడిగితే తీసుకోవడం లేదు. ఏం చేయాలి? - ఏసురెడ్డి, నారాయణఖేడ్‌ ఎల్‌డీఎం: బ్యాంకులో తీసుకోవాలని సూచిస్తాను. లేకపోతే సైఫాబాద్‌లోని ఆర్‌బీఐ వద్ద ఇవ్వాలి.
సమస్య: పటాన్‌చెరు మండలం చిట్కూల్‌ ఏపీజీవీబీ బ్యాంకులో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఒకే కౌంటర్‌ ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. కౌంటర్లు పెంచాలని మేనేజర్‌ను అడిగినా స్పందించడం లేదు? - భూమయ్య, చండూరు ఎల్‌డీఎం: కౌంటర్లు పెంచాలని బ్యాంక్‌ మేనేజర్‌కు సూచిస్తాను.
ఖాతాదారులకు సూచనలు...
మీ దగ్గర పాత రద్దు చేసిన నోట్లను విధిగా బ్యాంకులో జమ చేసుకోవాలి. ఇతరుల డబ్బులను బ్యాంకుల్లో వేసుకోవద్దు. అంతర్జాలంలో లావాదేవీలకు పరిమితి లేదు. జన్‌ధన్‌ ఖాతాలు తెరుచుకోవచ్చు. యాప్‌ల ద్వారా బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. వాటి ద్వారా కూడా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే నేరుగా బ్యాంకర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.

No comments:

Post a Comment