Tuesday, 29 November 2016

1980-2000

...మధ్య పుట్టినవాళ్లు ప్రపంచాన్ని లార్డ్స్‌ మైదానం చేసుకుని క్రికెట్‌ ఆడేస్తున్నారు. లక్ష్యాల్ని సునాయాసంగా ఛేదిస్తూ కార్పొరేట్‌ పరుగులో దూసుకుపోతున్నారు. వినూత్నమైన ఐడియాలతో అంకుర సంస్థలకు పెట్టుబడులు సమకూర్చుకుంటున్నారు. వీళ్లకు మానసిక శాస్త్రవేత్తలు ఖరారు చేసిన శాస్త్రీయనామం...వై-తరం, జనరేషన్‌-వై!
‘మీ- జనరేషన్‌’ అన్న ముద్దుపేరూ ఉంది. ‘నేను, నాదీ’ అన్న భావన ఎక్కువని ఆ పేరు పెట్టినట్టున్నారు. సాంకేతికతకు ప్రాణమిస్తారు కాబట్టి, ‘నెట్‌ జనరేషన్‌’ అనీ, ‘గ్లోబల్‌ జనరేషన్‌’ అనీ పిలుస్తారు. ఈతరం వయసు అటూ ఇటుగా...పదహారు నుంచి ముప్పై అయిదు. అందులోనూ ఇరవైల నుంచి ముప్పైల మధ్య మహా దూకుడు కనిపిస్తుంది. ఆమాటకొస్తే, ఒక్కోతరానికీ ఓ పేరు ఉంది.
1928కి ముందు...గ్రేటెస్ట్‌ జనరేషన్‌.
1928-1945...సైలెంట్‌ జనరేషన్‌.
1946-64...బేబీ బూమర్స్‌.
1965-79...జనరేషన్‌ ఎక్స్‌.
ఆతర్వాత - రయ్యిన దూసుకొచ్చిందే.. వై-తరం!
ప్రతి ఒకట్రెండు దశాబ్దాలకూ ఓ తరం మారిపోతుంది. ప్రతి తరమూ అంతకు ముందున్న తరంతో పోలిస్తే, ఎంతోకొంత భిన్నంగా ఉంటుంది, వేగంగానూ ఉంటుంది. పాతలోని లోపాల్ని సరిచేసుకుని ‘అప్‌గ్రేడ్‌ వెర్షన్‌’గా ముస్తాబై వచ్చేస్తుంది. మార్కెట్లోకి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఆ ఫీచర్స్‌ను అర్థం చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. మొదట్లో, అస్సలు కొరుకుడు పడనట్టుగా అనిపిస్తుంది. మెల్లమెల్లగా కిటుకులు తెలుస్తాయి. వై-తరం విషయంలోనూ అదే జరుగుతోంది. మాటతీరు తేడాగా ఉంటుంది, ఆలోచనా విధానం భిన్నంగా అనిపిస్తుంది. ఐడియాలు విచిత్రంగా కనిపిస్తాయి. ఆహార్యంలోనూ అసహజత్వమేదో గోచరిస్తుంది. ఆ చిరుగుల జీన్స్‌ కుర్రాళ్లని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక - ఆఫీసులో సీనియర్ల నుంచి మార్కెట్లో సేల్స్‌ సిబ్బంది దాకా...అంతా బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయాల్లో...కొత్త పాతను అర్థం చేసుకోవడం కంటే, పాతే కొత్తను అర్థం చేసుకోవడం న్యాయం, సహజధర్మం కూడా. నయా ఉద్యోగుల్ని బేరీజు వేయడానికి నియామక సంస్థలూ, ఇరవైలలోని ఖాతాదారుల కొనుగోలు మనస్తత్వాన్ని గ్రహించడానికి మార్కెటింగ్‌ దిగ్గజాలూ, నవ సమాజం తీరుతెన్నుల్ని మదింపువేసే ప్రయత్నంలో మనోవిజ్ఞాన సంస్థలూ వై-తరం మీద లోతైన అధ్యయనాలు ప్రారంభించాయి. ఇదీ ఒకందుకు మంచిదే. లేకపోతే...బాధ్యత తెలియని మనుషులనో, కెరీర్‌ బావిలో కప్పలనో ఆ కుర్రాళ్ల గురించి రకరకాల విమర్శలు వినిపించేవి. అవన్నీ శుద్ధ తప్పని తేలిపోయింది.
కార్పొరేట్‌ కత్తియుద్ధాలు...
వై-తరం యువతీయువకులు కార్పొరేట్‌ వాతావరణాన్ని ప్రభావితం చేయని కోణమంటూ లేదు. అద్దాల ఆవరణల్ని ఏకఛత్రంగా ఏలేస్తున్న కరడుగట్టిన బాసిజాన్ని ఆ కుర్రకుంకలు పూచికపుల్లతో సమానంగా చూస్తున్నారు. నో ‘గుడ్‌మార్నింగ్‌ సర్‌’లూ, నో చేతులు కట్టుకోవడాలూ, నో ఓవరాక్షన్లూ, నో పొగడ్తల బిస్కెట్లూ! ఓపికుంటే ఓ ‘హాయ్‌’ పడేస్తారు, లేదంటే అదీలేదు. వచ్చీరాగానే కంప్యూటర్‌లో తల దూర్చేస్తారు. మనసులో ఉన్నదే మాట్లాడేస్తారు. మాట్లాడిందే మనసులో ఉంచుకుంటారు. కర్రపెత్తనాలూ, డివైడ్‌ అండ్‌ రూల్‌ పాలసీలూ అస్సలు నచ్చవు. ఎవరో తమ మీద అజమాయిషీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తారు. ‘సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌’నే ఇష్టపడతారు. తమకు తామే బాసని భావిస్తారు. అంతటితో ఆగకుండా, లీడర్‌ అన్న పదానికి నిర్వచనాన్నే మార్చేస్తున్నారు. పాతతరం బాసులు అచ్చమైన నాన్‌పర్ఫార్మింగ్‌ కెప్టెన్లు. ‘అద్భుతాలు చేయాలోయ్‌!’ అనడమే తప్పించి, ఆ అద్భుతం ఎలాంటిదో వివరంగా చెప్పలేరు. ‘ఇరగదీయాలి’ అని పురమాయించడమే కానీ, ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’లో ఎప్పుడూ ఇరగదీసిన దాఖలాలుండవు. వై-తరం పద్ధతే వేరు. పక్కా పర్ఫార్మింగ్‌ కెప్టెన్లు! లక్ష్యాల కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడతారు. సిబ్బందితోనూ ఉత్సాహంగా పోరాటం చేయిస్తారు. గెలుపులో వాటా ఇస్తారు, ఓటమిలో బాధ్యత తీసుకుంటారు. రానున్న నాలుగైదు ఏళ్లలో....ప్రపంచ మానవ వనరుల జనాభాలో వై-తరమే సగానికి సగం ఉండబోతోంది. ఇప్పటికే ముప్పై నుంచి నలభైశాతం కార్పొరేట్‌ కొలువుల్ని వీళ్లే ఆక్రమించేసుకున్నారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అయితే ఆ జనాభా ఎనభై అయిదుశాతాన్ని దాటిపోయిందెప్పుడో! కొత్త కుర్రాళ్ల వ్యవహారశైలి...బేబీబూమర్స్‌ (1946-64)కూ జనరేషన్‌ ఎక్స్‌ (65-79)కూ మింగుడు పడటం లేదు. దీంతో, అద్దాల భవంతుల్లో అగాథం ఏర్పడసాగింది. పని మందగించడం మొదలైంది. ఆ విషయం హెచ్‌ఆర్‌ మేనేజర్లకూ అర్థమైపోయింది. ఆఫీసును ‘వై-ఫ్రెండ్లీ’గా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.

డెలాయిట్‌ తాజాగా నిర్వహించిన ఓ సర్వే కనుక నిజమైతే...ఇప్పటికిప్పుడు ఏదో ఓ ఉద్యోగంలో సర్దుకుపోతున్న యువతీయువకుల్లో డెబ్భై అయిదుశాతం దాకా...2020 నాటికి ప్రస్తుత కొలువులో కొనసాగే అవకాశం లేదు. అలా అని, ‘కుదురుగా ఉండటమే తెలీదు’ అని అభాండాలు వేయకండి. ఆ మార్పు జీతం కోసం కానేకాదని స్పష్టంచేస్తున్నారు. జీవితంలో తమను తాము నిరూపించుకోడానికే ఈ ప్రయత్నమని అంటున్నారు. ఆ స్వేచ్ఛాప్రియుల్ని దీర్ఘకాలం పాటూ నిలబెట్టుకోవడం కంపెనీలకు కత్తిమీద సామే. అందుకే, కార్పొరేట్‌ యాజమాన్యాలు ‘హ్యాండిల్‌ విత్‌ కేర్‌’ అని హెచ్‌ఆర్‌ మేనేజర్లను హెచ్చరిస్తున్నాయి. నిన్నటిదాకా ‘డ్రస్‌కోడ్‌’ పేరుతో సూటూబూటూ తప్పనిసరి చేసిన సంస్థలే ఇప్పుడు, ‘టీషర్ట్‌-జీన్స్‌ అయినా ఫర్వాలేదు’ అని మినహాయింపునిస్తున్నాయి. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లకు ఉదారంగా అనుమతినిస్తున్నాయి. ‘ఇంట్రాప్రెన్యూర్‌షిప్‌’ను ప్రోత్సహిస్తూ...ఓపక్క ఉద్యోగం చేస్తూనే సొంత ఐడియాలకు రూపమిచ్చే అవకాశం కల్పిస్తున్నాయి. ఇన్‌మొబీ ‘లెర్నింగ్‌ వాలెట్‌’ పేరుతో ప్రతి ఉద్యోగి ఖాతాలో కొంతడబ్బు వేస్తోంది. ఆ మొత్తంతో కొత్త భాష నేర్చుకోవచ్చు, కొత్త నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. వృత్తిపరంగా ఎదగడానికి అందులోని ప్రతి పైసా ఉపయోగించుకోవచ్చు. ఐబీఎమ్‌ ఇంకాస్త ముందుకెళ్లి కీలక బృందాలకు సమాంతరంగా షాడో టీమ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. అంటే, అసలు సిసలు బోర్డ్‌రూమ్‌లో తలపండిన ప్రొఫెషనల్స్‌ నిర్ణయాలు తీసుకుంటే, నమూనా బోర్డ్‌రూమ్‌లో పట్టుమని పాతికేళ్లు కూడా లేని కుర్రాడు వ్యూహరచన చేస్తాడు. ఒక్క జీతంరాళ్లతోనే వాళ్లనెవరూ కట్టిపడేయలేరు. బుర్రనిండా సవాళ్లివ్వాలి! ఆ పన్లో అర్థమూ పరమార్థమూ చూపించాలి.
ఒకానొక ప్రశ్నోత్తరాల వెబ్‌సైట్‌లో ఓ వై-తరం యువకుడు ‘నా చేతిలో రెండు ఆఫర్‌ లెటర్లున్నాయి. దేన్ని ఎంచుకోమంటారు?’ అని అడిగిన ప్రశ్నకు అదే తరానికి చెందిన ‘స్నాప్‌డీల్‌’ సీయీవో కునాల్‌ బాల్‌ ఇచ్చిన సమాధానం...ఆ ఇద్దరి మనస్తత్వాల్నే కాదు, మొత్తంగా 1980-2000 మధ్య పుట్టినవారి ఆలోచనల్ని ప్రతిబింబిస్తుంది.
‘రెండు ప్రశ్నలకు మీకు మీరే సమాధానం చెప్పుకోండి. ఆతర్వాతే ఏ నిర్ణయమైనా.ఒకటి -ఈ ఉద్యోగంలో చేరడం ద్వారా నేను సమాజాన్ని ఏ మేరకు ప్రభావితం చేయగలను. రెండు - ఈ ఉద్యోగంలో చేరడం ద్వారా కెరీర్‌లో నా ఎదుగుదల ఎలా ఉండబోతోంది’.

‘టెక్‌’ప్రెన్యూర్లు...
ఓ తరమంతా భావకవిత్వం రాసేసుకుంటూ బతికింది. ఓ తరమంతా విప్లవ సాహిత్యాన్ని కంఠతా పట్టేస్తూ కాలం గడిపేసింది. ఓతరమంతా సర్కారీ దస్త్రాల మధ్య బాగా నలిగిపోయింది. ఓ తరమంతా కలలకూ నిజాలకూ పొంతన కుదరక...నిరాశతో కుంగిపోయింది. ఆ వరుసలో ఇది ‘ఎంట్రప్రెన్యూర్‌షిప్‌’ జనరేషన్‌. వాళ్ల డీఎన్‌ఏలో వ్యాపారం ఉంది. వాళ్ల రక్తంలో సృజన ప్రవహిస్తుంది. ‘డిజైన్‌ థింకింగ్‌’ మరో ప్రత్యేకత. ఆలోచన అనేది అంతూపొంతూలేని భావాల రూపంలో కాకుండా...ఇటుక మీద ఇటుక పేర్చినంత స్పష్టంగా... నిర్మాణాత్మకంగా ఉంటుంది. లాప్‌టాప్‌, టాబ్లెట్‌, స్మార్ట్‌ఫోన్‌...ఏ ఒక్కటి లేకపోయినా వీళ్లకు వూపిరాడదు. కొంపదీసి, గాడ్జెట్స్‌కు బానిసలైపోయారా అన్న అనుమానమూ కలుగుతుంది. అలాంటి భయాలేం అక్కర్లేదు. ఇది, టెక్‌ జనరేషన్‌! ముందుతరంలా తెచ్చిపెట్టుకున్న ఆసక్తితోనో, వృత్తిపరమైన అవసరం కొద్దో టెక్నాలజీని జీవితంలో భాగం చేసుకోవాల్సిన అవసరం లేదు వీళ్లకు. ఆ ఆసక్తి అతి సహజమైంది. ఆ తరంతో పాటే ఇంటర్నెట్‌ పుట్టింది, టెక్నాలజీ పెరిగి పెద్దయింది. ఇ-మెయిల్స్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌...వై-తరంతో కలసి పెరిగాయి. ఆ అనుబంధమే వాళ్లని టెక్నోప్రెన్యూర్స్‌ చేస్తోంది, దిగ్గజాలకూ దిమ్మదిరిగే ఆవిష్కరణలు చేయిస్తోంది. కాబట్టే, టాటాలకూ అంబానీలకూ రాని ఆలోచనలు వై-తరానికి చెందిన ‘ఓలా’ భవిష్‌ అగర్వాల్‌కూ, ‘ఓయో రూమ్స్‌’ రితేష్‌కూ వస్తున్నాయి. నాస్కమ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ నివేదిక ప్రకారం...గత ఏడాది అంకుర సంస్థల్ని స్థాపించినవారిలో డెబ్భైరెండు శాతం మంది ముప్పై అయిదేళ్లలోపు యువతీయువకులే. అందులోనూ తొంభైశాతానికిపైగా సాంకేతికతతో ముడిపడిన వ్యాపారాలే. చేతిలో ఒక్క బండి కూడా లేకుండా, వేలకొద్దీ అద్దెకార్లను నడుపుతున్నాడు భవిష్‌ అగర్వాల్‌. ఓ మూలన ఉన్న క్యాబ్‌ ఓనర్లకూ మరో మూలన ఉన్న ప్రయాణికులకూ మధ్య జీపీఎస్‌ ద్వారా ఓ వర్చువల్‌ వంతెన వేయడమే ఆ వై-తరం కుర్రాడు చేసిన పని. ‘డు ఆర్‌ డు నాట్‌, దేర్‌ ఈజ్‌ నో ట్రై’...భవిష్‌కు నచ్చిన కొటేషన్‌. ఇదంతా, నరనరానా జీర్ణించుకుపోయిన సాంకేతిక నైపుణ్యం చేయించిన అద్భుతమే.

వై-తరం ఓ మూలన కూర్చుని కోక్‌ సిప్‌ చేస్తూనో పిజ్జా చప్పరిస్తూనో ఒంటరిగా పనిచేసుకోడానికే ఇష్టపడుతుందనీ, బృందాల్లో అస్సలు ఇమడలేదనీ ఓ వాదన ఉంది. అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని ఐబీఎమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ వాల్యూస్‌ సర్వేలో తేలింది. దాదాపుగా ప్రతి వై-తరం ఎంట్రప్రెన్యూర్‌కూ అంకుర సంస్థ ప్రారంభ సమయానికి భారీభారీ ఆఫీసులేం ఉండవు. ఏ కో-వర్కింగ్‌ స్పేస్‌లోనో ఓ కుర్చీటేబులూ అద్దెకు తీసుకుని పనిచేసుకుంటాడు. మాజీ సహోద్యోగినో నిన్నటి సహపాఠినో భాగస్వామిని చేసుకుంటాడు. ఒకరు మార్కెటింగ్‌ చూస్తే, ఒకరు ఫైనాన్స్‌ చూస్తారు. ఒకరు ఉత్పత్తి మీద దృష్టిసారిస్తే, ఒకరు పరిశోధన మీద గురిపెడతారు. బృందస్ఫూర్తి లేకపోతే, ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా?

మార్కెట్‌ మహారాజులు...
దాదాపు నలభైకోట్ల జనాభా వై-తరానిది. పాతవాళ్లతో పోలిస్తే, చేతికి ఎముకలేనట్టు ఖర్చుపెట్టే స్వభావం. కాబట్టే, ఈ తరాన్ని అర్థం చేసుకోడానికి మార్కెటింగ్‌ నిపుణులు మహా ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ, ఇ-షాపింగ్‌ నుంచి వీధి వ్యాపారం వరకూ ఎక్కడికెళ్లినా యువతదే హవా. అయినా, అంత త్వరగా బుట్టలోపడిపోయే రకమా మనవాళ్లు! ‘జీవితం కూడా ఫ్యాషన్‌ లాంటిదే. ఈపూట ఉన్న ట్రెండ్‌ మరోపూట ఉండదు. ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉంటాడన్న భరోసా లేదు’ - అంటూ మహా తాత్వికంగా చెప్పేస్తున్నారు. నిన్నటితరం యువకుడు....ఉద్యోగంలో చేరగానే బ్యాంకురుణం తీసుకుని ఇల్లు కట్టేసుకునేవాడు. ఫర్నిచర్‌ బిగించుకునేవాడు. వీలైతే పెళ్లికి ముందే కారు కొనేసుకునేవాడు. ఒకటేమిటి, హాయిగా జీవించడానికి అవసరమైన సరంజామా అంతా సొంతం చేసుకునేవాడు. తాజా తరానికి ఇలాంటి కోరికలేం పెద్దగా లేవు. కాబట్టే, మార్కెట్‌ రిసెర్చ్‌ నిపుణులు వై-తరాన్ని పట్టుకుని ‘వీళ్లు ఓనర్స్‌ కాదు...‘నో’నర్స్‌ - అని జోకేస్తున్నారు. ఓ సర్వేలో 30శాతం మంది భవిష్యత్తులోనూ కారుకొనే ఆలోచన లేదన్నారు, 15శాతం మందికి సొంతింటి కలలే లేవు, 20శాతం మందికి టీవీ విషయంలోనూ పెద్దగా పట్టింపులేదు. అలా అని కార్లో షికార్లు చేయకుండా ఉండరు, ఇంట్లో ఉండకుండానూ పోరు. అయితే, ‘కొనుగోలు’ అన్న జంజాటం పెట్టుకోరంతే. అన్నీ ‘అద్దె’కు తీసుకునే నడిపిస్తారు. వీళ్లచుట్టూనే ‘షేరింగ్‌ ఎకానమీ’ ప్రాణంపోసుకుంటోంది. ‘ఆ ఇల్లు నాదా, కాదా అన్నది అనవసరం. ఆ బండి ఎవరిదన్నదీ పట్టించుకోను. పని అవుతోందా లేదా, సౌకర్యంగా ఉందా లేదా...అన్నదే నాకు కావాలి’ అంటాడు ఎంట్రప్రెన్యూర్‌ అభిజిత్‌.
విలాసాలకంటే, అనుభూతికే ఈతరం ప్రాధాన్యం ఇస్తుంది. హిమాలయాల్ని అధిరోహించాలని కలలుకంటుంది, సముద్రాల్ని ఈదేయాలని తపనపడుతుంది. ప్రపంచమంతా చుట్టేసిరావాలని ఉవ్విళ్లూరుతుంది. ఒక్క సెల్‌ఫోన్‌ విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడటం లేదు. స్తోమతకు మించే ఖర్చు చేస్తున్నారు. షాపింగ్‌, డేటింగ్‌, ఈటింగ్‌, బ్యాంకింగ్‌...అన్నీ ఇందులోనే! ఆ తామరాకుమీద నీటిచుక్క వ్యవహారం...భౌతిక వ్యవహారాలకే పరిమితం. జీవిత లక్ష్యాల విషయానికి వచ్చేసరికి...ముప్పై అయిదు ఏళ్లు వచ్చేసరికి కంపెనీ టాప్‌టెన్‌లో ఒకరైపోవాలి, నలభైలో ఉద్యోగానికి రాజీనామా చేసేయాలి, నలభై అయిదుకంతా సొంత కంపెనీని బిలియన్‌ డాలరు స్థాయికి తీసుకెళ్లాలి, యాభైలో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఓ పల్లెను దత్తత తీసుకోవాలి. అరవైలో పూర్తిగా రిటైర్‌ అయిపోయి...పుస్తకాలు చదువుతూనో, సంగీతం వింటూనో కాలక్షేపం చేయాలి - ఇంత సుదీర్ఘంగా ఉంటున్నాయ్‌. మరణం తర్వాత శరీరాన్ని మెడికల్‌ కాలేజీకీ, పుస్తకాల్ని వేటపాలెం లైబ్రరీకీ పంపించాలి. ఆస్తుల్లో సగం కన్నపిల్లలకూ, మిగతా సగం అనాథ పిల్లలకూ...అన్నంత స్పష్టతా ఉంటోంది.

వ్యక్తిగత జీవితంలోనూ...
నవతరం ఏం చెప్పినా సూటిగానే చెబుతుంది, సుత్తిలేకుండా మాట్లాడుతుంది. ఆ వ్యక్తీకరణ కూడా, లెక్కల విద్యార్థి మెట్లుమెట్లుగా ఆల్జీబ్రా సమస్యను పరిష్కరించినట్టు ఉంటుంది. ప్రేమ-పెళ్లి, ఉద్యోగం-వ్యాపారం, విదేశం-స్వదేశం ఏ నిర్ణయమైనా క్షణాల్లో జరిగిపోతుంది. నీ గురించి నీకు బాగా తెలిసినప్పుడు, ఏ నిర్ణయానికైనా అరసెకెనుకు మించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు - అంటారు సైకాలజిస్టులు. అదే ఇక్కడ జరుగుతోంది.వ్యక్తిగత- వృత్తిగత జీవితాల మధ్య సమతౌల్యం ఎలా పాటించాలో వీళ్లకెవరూ చెప్పాల్సిన పన్లేదు.

ఇన్ఫోసిస్‌లో ఈమధ్యే కొలువు సంపాదించిన చక్రధర్‌...వారాంతాల్లో మాదాపూర్‌ నుంచి ఠక్కున మాయమైపోతాడు. అలా అని ఏ పబ్బులోనో తాగుతూ వూగుతూ కనిపించడు. భుజాన కెమెరా వేసుకుని శివార్లకు బయల్దేరిపోతాడు. ప్రకృతి చెక్కిన శిల్పాల్లాంటి...సహజ శిలల్ని మెడలోని ఖరీదైన కెమెరాలో బంధిస్తాడు. ఈ తరమే అంత! ప్రోగ్రామింగ్‌లో ఎంత దిట్టలో...అభిరుచుల్లోనూ అంతే ద్రష్టలు! డేటా ఎనాలసిస్‌లో ఎంత ప్రతిభో, సాహితీ విమర్శలోనూ అంతే విద్వత్తు. షార్ట్‌ఫిల్మ్‌ తీస్తే అవార్డుల పంట పండాల్సిందే. వైల్డ్‌లైఫ్‌ పొటోగ్రఫీ చేస్తే జీవరాశులన్నీ బారులు తీరి పోజులు ఇవ్వాల్సిందే. రవీంద్రభారతి వేదిక ఎక్కారా, ఆ నటనకు ప్రశంసలే ప్రశంసలు! ఆన్‌లైన్‌ కవుల వేదిక ‘కవి సంగమం’లో సగానికి సగం కవికుమారులు వై-తరంవారే, కత్తిలాంటి వృత్తి నిపుణులే.
మనుషుల్ని విజేతలుగా, పరాజితులుగా విడదీయలేం. నేటి విజేత రేపటి పరాజితుడు కావచ్చు. నేటి పరాజితుడు రేపటి విజేత కావచ్చు. సంపన్నుడు- పేద అన్న వర్గీకరణా అంతే అశాశ్వతమైంది. కాబట్టి మనుషుల్ని... నేర్చుకునేతత్వం ఉన్నవారూ, నేర్చుకునేతత్వం లేనివారూ అని విడదీస్తే సరిపోతుంది. వై-తరం అభిప్రాయమూ అదే. అందుకే, అధ్యయనానికి అంత ప్రాధాన్యం ఇస్తుంది. పూర్వం యూనివర్సిటీ పట్టా పుచ్చుకుని ఉద్యోగంలో చేరిపోగానే నేర్చుకునే ప్రక్రియ దాదాపుగా ఆగిపోయేది. చదువు ఉద్యోగం కోసం, ఉద్యోగం సంపాదన కోసం, చేతినిండా సంపాదన ఉన్నప్పుడు మళ్లీ చదువెందుకున్న వాదన వినిపించేది. వీళ్లు అలా కాదు...నేర్చుకుంటూనే ఉంటారు, తమను తాము అప్‌డేట్‌ చేసుకుంటూనే ఉంటారు. ఇంజినీరింగ్‌ తర్వాత ఏ ఎంబీయేనో చేస్తారు. ఆతర్వాత మళ్లీ ఏ ఐఎస్‌బీలోనో సీటొస్తే గెంతుకుంటూ వెళ్లిపోతారు. అది కాస్తా పూర్తయ్యాక, ఏ అమెరికన్‌ యూనివర్సిటీకో దరఖాస్తు చేస్తారు. మధ్యమధ్యలో చిన్నాపెద్దా ఆన్‌లైన్‌ కోర్సులు ఉండనే ఉంటాయి. పాత తరానికి నేర్చుకోవడం అంటే పుస్తకాలు ముందేసుకోవడమే. కానీ, నవతరం ‘సోషల్‌ లెర్నింగ్‌’ను బాగా ఇష్టపడుతోంది. సమాజాన్ని అతి దగ్గర నుంచీ అధ్యయనం చేయాలనుకుంటోంది. సోషల్‌ మీడియాలో చర్చల ద్వారా, అనుభవాల్ని పంచుకోవడం ద్వారా, మరొకరి అనుభవాల్ని తెలుసుకోవడం ద్వారా...నిపుణుల బ్లాగుల్ని క్లిక్‌ చేయడం ద్వారా...సహజ జిజ్ఞాసను సంతృప్తి పరుచుకుంటోంది. ‘నెట్‌వర్కింగ్‌’ పెంచుకోవడం అన్నదీ ఆ జ్ఞానదాహంలో భాగమే. అవకాశాల్ని అందిపుచ్చుకోడానిక్కూడా ఆ బృందవిస్తరణ పనికొస్తుంది.

సైకాలజిస్టులు నవతరంలో ‘ప్రో సోషల్‌ బిహేవియర్‌’ను గుర్తించారు. పైకి వ్యక్తం చేయకపోవచ్చు కానీ, చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా గమనిస్తారు. అవినీతి, కాలుష్యం, విలువల రాహిత్యం... ఇలా వివిధ పరిణామాలకు తీవ్రంగా కలతచెందుతారు. ‘నా వంతుగా ఏమీ చేయలేనా?’ అని లోతుగా ఆలోచిస్తారు. ఆ బాధ్యతలోంచి వచ్చిన సామాజిక వ్యాపార సంస్థలు చాలానే ఉన్నాయి. ఎదుగూ ఎదగనివ్వూ - నయాతరం నినాదం. కాబట్టే, పేటీఎమ్‌ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మ తన కార్యాలయంలో ఇరవైనాలుగు స్టార్టప్స్‌కు నీడనిచ్చాడు. ఇంత పెద్ద మనసు వై-తరం మినహా, ఎవరితరం?
* * *
ఇన్వాల్వ్‌మెంట్‌... కమిట్‌మెంట్‌...
రెండూ చూడ్డానికి ఒకేలానే అనిపిస్తాయి. కానీ చాలా తేడా ఉంది. ఒకటి కోడిగుడ్డు లాంటిదైతే, మరొకటి చికెన్‌ పీసు లాంటిది. గుడ్డు పెట్టడంతో తన పాత్ర పూర్తయిపోయిందని భావిస్తుంది కోడి.
ఇది ఇన్వాల్వ్‌మెంట్‌.
లక్ష్యం కోసం తనను తాను అంకితం చేసుకుంటుంది పుంజు.
ఇది కమిట్‌మెంట్‌.
వై-తరానిది... సెంట్‌పర్సెంట్‌ కమిట్‌మెంట్‌!




వై-తెలివితేటలు!
విజయ్‌ ఓ ఆర్నెల్లు ఉద్యోగానికి సెలవు పెట్టేసి జీవిత భాగస్వామితో కలసి ప్రపంచమంతా చుట్టొచ్చాడు. పదీ పన్నెండు కేజీల బ్యాక్‌ మినహా ఎలాంటి లగేజీ తీసుకెళ్లలేదు. ఎక్కడికెళ్లినా... హోటళ్లలో దిగే ప్రయత్నం చేయలేదు. స్థానికుల నివాసాల్లోనే ఉన్నాడు. దీనివల్ల అక్కడి సంస్కృతిని అతిదగ్గర నుంచీ గమనించవచ్చని ఆ దంపతుల ఆలోచన. అది చవకైన ప్రత్యామ్నాయం కూడా. ఆ యాత్రలో ఆసక్తికరంగా అనిపించిన ప్రతి అనుభవాన్నీ బ్లాగులో పెట్టాడు. భారతదేశానికి తిరిగి వచ్చేసరికి... అతడి బ్లాగును అనుసరించేవారి సంఖ్య రెండువేలకు చేరింది. ఇంతవరకూ బాగానే ఉంది. ‘అసలు, విజయ్‌కి సెలవిచ్చిన పుణ్యాత్ముడెవరు. వెళ్లి కాళ్లకు దండం పెట్టుకుంటాం’ అంటారా? మళ్లీ అదో కథ. ఇక్కడే వై-తరం తెలివితేటలు బయటపడ్డాయి. ‘నాకు ఈ పర్యటన ఎంత ముఖ్యం అంటే...’ అనే శీర్షికతో ఓ సుదీర్ఘమైన లేఖ రాశాడు. అదే, కఠినహృదయుడైన బాసును కరిగించింది. అందులో కవితాత్మక వ్యక్తీకరణేం లేదు. కానీ, నిఖార్సయిన నిజాయతీ ఉంది.
షేర్ చేయండి share this

 https://www.youtube.com/c/msworld1